బాక్సర్ మేరీకోమ్‌కు కేంద్ర ప్రభుత్వం కొత్త బాధ్యతలను అప్పగించింది. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ చరణ్ సింగ్‌పై లైంగిక ఆరోపణల నేపథ్యంలో..ఈ ఆరోపణలపై విచారణ జరిపేందుకు కేంద్రం కొత్త కమిటీని నియమించింది. ఈ కమిటీకి మేరీకోమ్ అధ్యక్షురాలిగా ఎంపికైంది. దీంతో పాటు, మేరీకోమ్ రెజ్లింగ్ రోజువారీ వ్యవహరాలను కూడా చూసుకోనుంది.
మొత్తం నలుగురు సభ్యులతో కూడిన కమిటీని కేంద్ర క్రీడాశాఖ నియమించింది. ఈ కమిటీలో మేరీ కోమ్‌తోపాటు ఒలింపిక్ మెడల్ విజేత యోగేశ్వర్ దత్, మాజీ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి తృప్తి ముర్గుండే, స్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాధికా శ్రీమన్ టార్గెట్ ఒలింపిక్ పోడియమ్ స్కీమ్ మాజీ సీఈఓ రాజగోపాలన్ మిగిలిన సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ డబ్ల్యుఎఫ్ఐ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ చరణ్ సింగ్‌తో పాటు, ఇతర కోచ్‌లను విచారించనుంది.
బ్రిజ్ భూషణ్‌పై రెజ్లర్ వినేష్ ఫోగాట్తోపాటు పలువురు రెజ్లర్లు లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. బ్రిజ్ భూషణ్‌ను తొలగించాలని డిమాండ్ చేస్తూ రెజ్లర్లు మూడు రోజుల పాటు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేశారు. రెజ్లర్ల ఆరోపణలపై విచారణ జరుపుతామని ప్రభుత్వం హామీ ఇవ్వడంతో రెజ్లర్లు తమ ఆందోళనను విరమించారు.
రెజ్లర్లతో మాట్లాడిన కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్..నాలుగు వారాల్లో దీనిపై విచారణ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో మేరీకోమ్‌తో సారథ్యంలో కేంద్రం కమిటీని ఏర్పాటు చేసింది.