అండమాన్ అండ్ నికోబార్ దీవుల్లో ఏర్పాటు చేయనున్న నేతాజీ సుభాష్ చంద్రబోస్ మెమోరియల్‌కు సంబంధించిన నమూనాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం ఆవిష్కరించారు. అంతేకాకుండా.. అండమాన్‌లోని 21 దీవులకు వీర సైనికుల పేర్లు పెట్టారు.
నేతాజీ సుభాష్ చంద్రబోస్ 126వ జన్మదినం సందర్భంగా పోర్ట్ బ్లెయిర్‌లో నిర్వహించిన ఓ ఈవెంట్లో వర్చువల్‌గా పాల్గొంటూ ప్రధాని 21 దీవులకు పరమ్ వీర్ చక్ర అవార్డు గ్రహీతుల పేర్లు పెట్టారు. వీర సైనికులకు గౌరవం, గుర్తింపు దక్కాలని ప్రధాని మోదీ చేస్తున్న కృషిలో భాగంగానే ఈ నామకరణ వేడుక జరిగింది.
“ఈ రోజు అండమాన్ ప్రజల ముందు నేను ప్రసంగిస్తుండటం చాలా గర్వంగా ఉంది. 1943లో ఇదే అండమాన్ దీవుల నుంచి నేతాజీ సుభాష్ చంద్రబోస్.. తొలిసారిగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. స్వతంత్ర భారత దేశంలో తొలి ప్రభుత్వం ఏర్పడింది ఇక్కడే. ఈరోజు నేతాజీ జన్మదినం. దేశం ఈరోజును పరాక్రమ్ దివాస్‌గా జరుపుకుంటోంది. వలస పాలనపై నేతాజీ చేసిన పోరాటం చిరస్మరణీయం,” అని ప్రధాని మోదీ తెలిపారు.
ఈ క్రమంలోనే 21మంది పరమ్ వీర్ చక్ర అవార్డు గహ్రీతులను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు. “ఈ 21మంది పరమవీరులకు.. దేశమే తొలి ప్రాధాన్యత. ఈరోజున.. ఈ 21 దీవులకు వారి పేర్లు పెట్టడంతో వారి ధృడ సంకల్పం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. వారి త్యాగాలు రాబోయే తరాలకు స్ఫూర్తినిస్తాయి. ఇలా పేర్లు పెట్టడం నాకు చాలా సంతోషంగా ఉంది,” అని మోదీ స్పష్టం చేశారు.
“దశాబ్దాలుగా.. భారత దేశ సత్తాను తక్కువ చేసి చూశారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. అత్యాధునిక అభివృద్ధివైపు ఇండియా దూసుకెళుతోంది. దేశాభివృద్ధిలో అండమాన్ చాలా కీలకం. అండమాన్ అభివృద్ధికి.. గత 8 ఏళ్లుగా మా ప్రభుత్వం చాలా కృషి చేసింది. ప్రపంచానికి ఈ దీవులు ఎంతో మేలు చేస్తాయి. కానీ గతంలో వీటిని విస్మరించారు. ఎలాంటి చర్యలు తీసుకోలేదు,” అని మోదీ విమర్శించారు.
అండమాన్‌లోని దీవులకు సైనికుల పేర్లు పెట్టాలన్న మోదీ నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు లభిస్తున్నాయి. మోదీ నిర్ణయాన్ని అనేక మంది ప్రముఖులు స్వాగతించారు. వీర సైనికులకు ఇదే సరైన గుర్తింపు అని కొనియాడారు.