ప్రముఖ డిజిటల్ చెల్లింపులు, ఫిన్‌టెక్ వేదిక ఫోన్ పే తన ప్రధాన కార్యాలయాన్ని సింగపూర్ నుంచి భారత్‌కు మార్చికోవాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం తమ ఇన్వెస్టర్లు రూ.8,000 కోట్ల పన్ను చెల్లింపులు చేశారని ఫోన్ పే కో పౌండర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సమీర్ నిగమ్ తమ సంస్థ మరో సహ వ్యవస్థాపకుడు రాహుల్ చారితో కలిసి తెలిపారు.
ఏదైనా దేశం నుంచి ఓ కంపెనీ భారత్‌కు పూర్తిగా మారాలంటే ఇన్వెస్టర్లు మూలధన రాబడులపై పన్నులు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఇదే క్రమంలో తమ సంస్థ తాజా మార్కెట్ వాల్యుయేషన్ ప్రకారం పన్ను చెల్లించాల్సి వస్తుందని చెప్పారు. ఫోన్‌పే ఇటీవల రూ.2,850 కోట్ల (350 మిలియన్ డాలర్లు) సమీకరించింది.
దీంతో ఆ కంపెనీ విలువ సుమారు రూ.97,800 కోట్ల (12 బిలియన్ డాలర్లు)కు చేరినట్లయ్యింది. దాదాపు 100 కోట్ల డాలర్ల మేర నిధులను సంస్థ సమీకరించనుండగా, జనరల్ అట్లాంటిక్‌తో పాటు మార్క్ గ్లోబల్ వంటి అంతర్జాతీయ, దేశీయంగా పేరున్న పెట్టుబడి సంస్థలు కూడా తాజా నిధుల సమీకరణ ప్రక్రియలో సహకరించాయి. ఈ సంస్థకు 40 కోట్ల మంది ఖాతాదారులున్నారు.