గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ను సీఎం కేసీఆర్ అవమానించిన తీరుపై కేంద్ర హోమ్ మంత్రికి ఓ బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధిగా ఫిర్యాదు చేస్తానని బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు, ఎమ్యెల్యే ఈటెల రాజేందర్ వెల్లడించారు. గవర్నర్ను అవమానపరచడం అంటే రాజ్యాంగాన్ని అవమానపరచడమేనని అని స్పష్టం చేశారు.
రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజైన జనవరి 26న గణతంత్ర దినోత్సవ వేడుకలను తెలంగాణ ప్రభుత్వం నిర్వహించకపోవడం సిగ్గుచేటని పేర్కొంటూ రాజ్యాంగం పట్ల కేసీఆర్ వ్యవహరించిన తీరు అత్యంత జుగుప్చాకరంగా ఉందని విమర్శించారు. రాష్ట్రపతి, ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, గవర్నర్, ముఖ్యమంత్రి వంటి పదవులు రాజ్యాంగబద్ధంగా సంక్రమించినవేనని, వాటికి వచ్చే గౌరవం వ్యక్తిగతమైనదేమీ కాదని హితవు చెప్పారు.
గణతంత్ర ఉత్సవాలను నిషేధించిన ఏకైక రాష్ట్రంగా తెలంగాణ చరిత్రకెక్కిందని ఆవేదన వ్యక్తం చేశారు. గవర్నర్లకు, ముఖ్యమంత్రులకు మధ్య ఏవైనా ఇబ్బందులుంటే ముఖ్యమంత్రులే కూర్చుని పరిష్కరించుకుంటారు తప్ప గణతంత్ర దినోత్సవాలను బహిష్కరించలేదని చెప్పారు. తమిళనాడులో, ఢిల్లీలో ప్రతిపక్ష ప్రభుత్వాలున్నా సరే గవర్నర్లను కించపరిచే విధంగా మాట్లాడలేదని, ఉత్సవాలను నిషేధించలేదని ఉదహరించారు
కేసీఆర్ గవర్నర్ల వ్యవస్థకు వ్యతిరేకం కాదని, తెలంగాణ ఏర్పడ్డ కొత్తలో హోదా మరిచి మరీ నాటి గవర్నర్కు సాష్టాంగ నమస్కారం చేసిన వ్యక్తేనని రాజేందర్ గుర్తుచేశారు. తను ఫ్యూడల్ వ్యవస్థలో పుట్టానని కేసీఆర్ స్వయంగా చెప్పుకున్నారని, దొరల వ్యవస్థలో పురుషాధిక్యత ఉంటుందని, స్త్రీల పట్ల చులకన భావన ఉంటుందని చెప్పారు.
అందుకే ఐదేళ్ల పాటు రాష్ట్ర మంత్రివర్గంలో మహిళ లేకుండా ప్రభుత్వాన్ని నడిపిన ఘనుత కేసీఆర్ దక్కించుకున్నారని తెలిపారు. చివరకు ఎమ్మెల్యే పదవుల్లోనూ దళిత, బీసీ మహిళలకు చోటు లేకుండా చేశారని విమర్శించారు. మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కావాలని తీర్మానాలు చేస్తారు తప్ప ఆచరణ మాత్రం లేదని ధ్వజమెత్తారు.
“బొడిగశోభ ఉద్యమకారిణి, ఒకే ఒక్క మహిళ ఎమ్మెల్యే ఉంటే ఆమెకు టికెట్ ఇవ్వలేదు. ఈ మహిళ నా చెప్పుచేతుల్లో ఉండదు, బానిసత్వంలో ఉండదు. ప్రశ్నించేతత్వం ఉంటుంది.. ప్రశ్నించే వారు ఉండవద్దు అని ఉన్నొక్క గొంతును నొక్కి మహిళా జాతిని అవమానపరిచిన వ్యక్తి కెసిఆర్” అంటూ ఈటెల గుర్తు చేశారు.