కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ భారత్ జోడోయాత్ర ముగింపు దశకు చేరుకుంది. సోమవారం శ్రీనగర్‌లోని షేర్-ఇ-కశ్మీర్ క్రికెట్ స్టేడియంలో జరిగే భారీ బహిరంగ సభతో ముగియనుంది. భారత్ జోడో యాత్రలో భాగంగా ఆదివారం మధ్యాహ్నం ముందుగా అనుకోకుండా అకస్మాత్తుగా శ్రీనగర్‌లోని చారిత్రాత్మక లాల్ చౌక్‌లో రాహుల్ గాంధీ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరింఛారు.
తన ముత్తాత జవహర్లాల్ నెహ్రూ లాల్ చౌక్‌లో మొదటిసారి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన సరిగ్గా 75 సంవత్సరాల తర్వాత రాహుల్ ఇక్కడ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడం గమనార్హం. ముందుగా ఇక్కడ భద్రతా కారణాల దృష్ట్యా జాతీయ పతాకం సోమవారం ఎగరవేయడానికి అధికారులు అనుమతి ఇవ్వకపోవడంతో, ఇక్కడకు సమీపంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎగురవేయాలని అనుకున్నారు.
అయితే, శనివారం అధికారులతో జరిగిన మంతనాలలో ఆదివారం ఎగురవేయడానికి అనుమతి ఇచ్చారు. అయితే, పాదయాత్రగా కాకుండా గుప్కర్ దగ్గర నుండి వాహనాల కాన్వాయ్ లో వచ్చి రాహుల్ ఇక్కడ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. సోమవారం పార్టీ కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే ఎగురవేస్తారని ప్రకటించారు.
కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు ద్వేషాన్ని పారద్రోలి హృదయాలను కలిపే పేరుతో 140 రోజుల పాటు సాగిన 4,080 కి.మీ దూరం జరిగింది. సోమవారం నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమానికి 12 ప్రతిపక్ష పార్టీలు హాజరుకానున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ కార్యక్రమానికి 21 పార్టీలను ఆహ్వానించామని, అయితే భద్రతాకారణాల రిత్యా కొందరు హాజరుకావడం లేదని ఆ వర్గాలు వెల్లడించాయి.
సిపిఎం, సిపిఐలతో పాటు డిఎంకె, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, ఆర్జెడి, జెడియు, శివసేన, విసికె, కేరళ కాంగ్రెస్, ఫరూక్ అబ్దుల్లా నేతృత్వంలోని జమ్ముకాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పిడిపి), షిబు సోరెన్ నేతృత్వంలోని జార్ఖండ్ ముక్తి మోర్చా (జెఎంఎం) శ్రీనగర్‌లో జరిగే కార్యక్రమానికి హాజరవనున్నట్లు తెలిపాయి.
కాగా, టిఎంసి, సమాజ్‌వాది పార్టీ, టిడిపి పార్టీలు ఈ కార్యక్రమానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. గతేడాది సెప్టెంబర్ 7న కన్యాకుమారి నుండి జోడోయాత్ర ప్రారంభమైంది.12 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ యాత్ర సాగింది.
ఇలా ఉండగా, 1992లో అప్పటి బీజేపీ అధ్యక్షుడు మురళీ మనోహర్ జోషి గణతంత్ర దినోత్సవం రోజున లాల్ చౌక్‌లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తానని ప్రకటించారు. జోషి, ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీతో సహా పలువురు పార్టీ సహచరులు కలిసి కర్ఫ్యూ, భద్రతా వలయం మధ్య జెండాను ఎగురవేశారు. లాల్ చౌక్‌లో జెండా ఎగురవేత కార్యక్రమాన్ని లక్ష్యంగా చేసుకుని మిలిటెంట్లు రాకెట్లు పేల్చారు.