పాకిస్థాన్‌లో ఘోరం సంభవించింది. ప్రజలు ప్రార్థనలు చేస్తుండగా పెషావర్‌లోని ఓ మసీదులో సోమవారం భీకరమైన ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ బాంబు పేలుడు మంగళవారం ఉదయానికి మృతుల సంఖ్య 83కి పెరిగింది. ఈ దుర్ఘటనలో 150 మందికిపైగా గాయపడ్డారు. 100 మందికిపైగా క్షతగాత్రులు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
ఈ బాంబు దాడికి తామే పాల్పడ్డామని పాక్ తాలిబన్ కామాండర్ సర్బకఫ్ మొమంద్ ప్రకటన విడుదల చేశారు. వందలాది మంది ప్రజలు సామూహికంగా మసీదులో ప్రార్థనలు చేస్తుండగా పేలుడు పదార్థాలతో వచ్చి ఓ వ్యక్తి ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడని అక్కడి స్థానిక పోలీస్ అధికారి జాఫర్ ఖాన్ వెల్లడించినట్టు న్యూస్ ఏజెన్సీ ఏపీ రిపోర్ట్ వెల్లడించింది.
ఈ బాంబు పేలుడుతో పెషావర్‌లోని ఆ మసీదు చాలా భాగం కూలిపోయిందని, కాగా, ఆత్మాహుతి దాడి జరిగిన ప్రాంతాన్ని పోలీసులు సీజ్ చేశారు. కేవలం అంబులెన్స్‌లను మాత్రమే అనుమతిస్తున్నారు. పేలుడు ధాటికి భవనం పూర్తిగా దెబ్బతింది. భవనం కొంత భాగం కుప్పకూలిపోగా ఆ శిథిలాల కింద కొందరు చిక్కుకున్నారు. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
ఈ బాంబు దాడిని పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ తీవ్రంగా ఖండించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను, ఈ దాడిపై పూర్తి విచారణ చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ దాడి వెనుక ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కూడా ఈ బాంబు దాడిపై స్పందించారు. బాధితుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. పెరుగుతున్న ఉగ్రవాదం ముప్పును ఎదుర్కొనేందుకు తమ దేశం నిఘా వ్యవస్థను మెరుగుపరుచుకోవడం, పోలీసు బలగాలను పెంచుకోవడం చేయాలని ఆయన ట్వీట్ చేశారు.
కాగా, సుమారు 400 మంది పోలీసుల భద్రతా వ్యవస్థ ఉన్నచోట ఈ బాంబుదాడి ఏ విధంగా జరిగిందో అధికారులకు అంతుబట్టడం లేదు. అక్కడకు బాంబులు తీసుకు రావాలంటే రెండు చోట్ల తనిఖీలు దాడి రావాల్సి ఉంటుంది.