మహిళల సాధికారత కోసం కేంద్ర సర్కార్ ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిందని, బేటీ బచావో.. బేటీ పడావో విజయవంతం అయ్యాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రశంసించారు. పార్లమెంట్ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగిస్తూ దేశంలో పురుషుల సంఖ్య కన్నా ఇప్పుడు మహిళల సంఖ్య ఎక్కువగా ఉందని, మహిళ ఆరోగ్య స్థితి కూడా మెరుగుపడినట్లు ఆమె చెప్పారు. “మహిళా సాధికారతను ప్రోత్సహిస్తున్నాం.. అన్ని రంగాల్లో మహిళలు ముందుండేలా చర్యలు తీసుకుంటున్నాం. సైన్యంలో మహిళలకు అవకాశాలు కల్పించాం..” అని రాష్ట్రపతి తెలిపారు.
రైతుల ఆదాయాన్ని వృద్ధి చేశామని, గ్రామాలను కూడా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. గరీబీ హఠావో పథకంతో దేశంలో పేదరికాన్ని నిర్మూలించే ప్రయత్నం చేస్తున్నామని ఆమె కొనియాడారు. పీఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన్ స్కీమ్‌ను విస్తరించడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు.
ఈ స్కీమ్‌పై ప్రపంచ దేశాలు ప్రశంసలు కురిపిస్తున్నట్లు ఆమె వెల్లడించారు. కరోనా మహమ్మారి వేళ ప్రజల ప్రాణ రక్షణ కోసం తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిందని ముర్ము తెలిపారు. దేశానికి అతిపెద్ద శత్రువైన అవినీతి నిర్మూలన కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని చెబుతూ అవినీతిని అంతం చేయాలంటే బలమైన వ్యవస్థను నిర్మించాలని ఆమె పిలుపిచ్చారు. ప్రజాస్వామ్యానికి.. సామాజిక న్యాయానికి అతిపెద్ద శత్రువు అవినీతి అని ఆమె స్పష్టం చేశారు.
“అవినీతి అంతం దిశగా అడుగులేస్తోంది. అవినీతికి వ్యతిరేకంగా నిరంతర పోరాటం సాగుతోంది. అవినీతి రహిత వ్యవస్థలను రూపొందిస్తున్నాం. ప్రభుత్వంలో జవాబుదారీతనం పెంచాం. బినామీ ఆస్తుల స్వాధీనం దిశగా చర్యలు తీసుకున్నాం” అని రాష్ట్రపతి వెల్లడించారు. దేశ ప్రజల్లో విశ్వాసం టాప్ స్థాయిలో ఉందని, ఇదే అతిపెద్ద మార్పు అని పేర్కొంటూ ఇండియా పట్ల ప్రపంచ దేశాల దృష్టి కూడా మారినట్లు ఆమె చెప్పారు.
జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు నుంచి ట్రిపుల్ తలాక్ రద్దు లాంటి కీలక అంశాల నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. స్థిరమైన, భయంలేని, నిర్ణయాత్మక ప్రభుత్వం అధికారంలో ఉందని, పెద్ద పెద్ద కలల్ని ఆ ప్రభుత్వం నెరవేరుస్తున్నట్లు రాష్ట్రపతి పేర్కొన్నారు. పేదరికం లేని భారత్‌ను నిర్మించాలని భావిస్తున్నట్లు ఆమె చెప్పారు.
భారతీయుల ఆత్మస్థైర్యం అత్యున్నత స్థాయిలో ఉందని, ప్రపంచ దేశాలు ఇప్పుడు మనల్ని భిన్న కోణంలో చూస్తున్నాయని, ప్రపంచ దేశాలకు ఇప్పుడు ఇండియా పరిష్కారాలు ఇస్తున్నట్లు ఆమె తెలిపారు. దేశ ప్రజల అభివృద్ధి, రక్షణ కోసం కేంద్రం నిర్భయంగా వ్యవహరిస్తోందని ఆమె చెప్పారు.
‘‘75 ఏళ్ల స్వాతంత్ర ఉత్సవాలను పూర్తిచేసుకున్నాం. కొన్ని నెలల కిందటే ఆజాదీకా అమృత్ మహోత్సవాలు నిర్వహించుకున్నాం.. రాబోయే పాతికేళ్లు దేశానికి ఎంతో కీలకం.. 2047 నాటికి దేశాన్ని ఆత్మనిర్భర్ భారతంగా తీర్చిదిద్దాలి” అని ఆమె పేర్కొన్నారు.దేశం ఆత్మనిర్భర్ భారత్‌గా ఆవిర్భవిస్తోందని, ప్రపంచానికి పరిష్కారం చూపేలా మారిందని కితాబిచ్చారు.
స్థిరమైన, నిర్ణయాత్మక ప్రభుత్వం.. పెద్ద కలలను సాకారం చేసుకునే దిశగా వేగంగా అడుగులు వేస్తోందని రాష్ట్రపతి ప్రశంసించారు. డిజిటల్ ఇండియా దిశగా ముందుకు వడివడిగా సాగుతూ నూతన సాంకేతిక ఆధారంగా డిజిటల్ ఇండియా దిశగా ముందుకు వడివడిగా సాగుతూ నూతన సాంకేతిక ఆధారంగా పౌరులకు సేవలందిస్తున్నామని ఆమె తెలిపారు.
“సాంకేతికతను అందిపుచ్చుకుని నూతన ఆవిష్కరణలు చేపడుతున్నాం… భారత డిజిటల్ నెట్వర్క్ వ్యవస్థ ప్రపంచానికే ఉదాహరణగా మారింది… ఆయుష్మాన్ భారత్ వంటి మెరుగైన పథకాలు.. జల్‌జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి తాగునీరు.. అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేస్తున్నాం. రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు నమోదవుతున్నాయి. మూడు కోట్ల మందికి సొంతిళ్లు నిర్మించాం. నిరుపేదలకు ఉచిత బియ్యం పంపిణీ కొనసాగుతోంది’’ అని ద్రౌపది ముర్ము తన ప్రసంగంలో పేర్కొన్నారు.