2023-24 ఆర్ధిక సంవత్సరంలో భారత దేశ ఆర్థిక వ్యవస్థ 6.5శాతం వృద్ధి చెందుతుందని ఎకనామిక్ సర్వే అంచనా వేసింది. అయితే ప్రస్తుతం ఉన్న అనిశ్చితుల కారణంగా వాస్తవ జీడీపీ లిమిట్‌ని 6- 6.8శాతం మధ్యలో ఉంచుతున్నట్టు స్పష్టం చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి 7శాతంగా ఉంటుందని పేర్కొంది. ప్రస్తుతం కన్నా వచ్చే ఆర్థిక ఏడాదిలో జీడీపీ వృద్ధి నెమ్మదించినప్పటికీ.. భారత దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగైన స్థితిలోనే ఉందని పేర్కొంది.
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా.. ఎకనామిక్ సర్వే 2023ని మంగళవారం . కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. ఫిబ్రవరి 1న బడ్జెట్ ఉండనున్న నేపథ్యంలో ఎకనామిక్ సర్వేకు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా భారత్ ఎదుగుతోందని ప్రపంచంలోని వివిధ సంస్థలు చెబుతున్న మాటలను ఎకనామిక్ సర్వే పునరుద్ఘాటించింది. కరోనా, రష్యా- ఉక్రెయిన్ యుద్ధం, వడ్డి రేట్ల పెంపు వంటి ప్రమాదకరమైన అంశాలు.. ఏడాది కాలంగా ఇబ్బందులు పెడుతున్నప్పటికీ.. భారత దేశం వృద్ధి చెందుతోందని స్పష్టం చేసింది.
“భారత్ జీడీపీ వృద్ధి అంచనాలు.. వరల్డ్ బ్యాంక్, ఐఎంఎఫ్, ఓడీబీ, ఆర్బీఐ అంచనాలకు తగ్గట్టుగానే ఉన్నాయి. అంతర్జాతీయ ఆర్థిక, రాజకీయ పరిస్థితుల బట్టి.. వాస్తవ జీడీపీ.. 6-6.8శాతం మధ్యలో ఉంటొచ్చు,” అని ఎకనామిక్ సర్వే స్పష్టం చేసింది. భారత దేశ ఆర్థిక వ్యవస్థ కరోనా ముందు స్థాయికి చేరుకుందని ఎకనామిక్ సర్వే 2023 స్పష్టం చేసింది. వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితాలో భారత్ తన స్థానాన్ని పదిలం చేసుకుందని వివరించింది.
అభివృద్ధి చెందిన దేశాల్లో ఆర్థిక మాంద్యంపై భయాలు నెలకొనడంతో.. ఇండియాలోకి నిధుల ప్రవాహం కొనసాగుతుందని ఎకనామిక్ సర్వే అంచనా వేసింది. దేశంలో ద్రవ్యోల్బణం ప్రస్తుతం 6శాతం కన్నా తక్కువే ఉందని, అంతకన్నా ఎక్కువ ఉన్న సందర్భాల్లోనూ అది పెట్టుబడలు ప్రవాహాన్ని, ప్రైవేటు వినియోగాన్ని అడ్డుకోలేకపోయిందని పేర్కొంది. దేశంలో ఆర్థిక వ్యవస్థ మెరుగుపడటానికి ప్రధాన కారణం.. ప్రభుత్వం మద్దతుతో పెరుగుతున్న పెట్టుబడులు, ప్రైవేటు కన్జమ్షన్ అని ఎకనామిక్ సర్వే 2023 వెల్లడించింది. అదే సమయంలో.. ప్రైవేటు రంగాల్లోను పెట్టుబడుల ప్రవాహం పెరగాల్సి ఉందని సర్వే అభిప్రాయపడింది. ఉద్యోగాలను సృష్టించే ప్రక్రియ మరింత వేగవంతం అవ్వాల్సిన అవసరం ఉందని తెలిపింది.