కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటుకు సమర్పించిన 2023-2024 కేంద్ర బడ్జెట్ పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. చారిత్రక బడ్జెట్ ప్రవేశపెట్టారంటూ నిర్మలా సీతారామన్ బృందాన్ని అభినందించారు. పేదలు, మధ్యతరగతి ప్రజానీకం, రైతులతో సహా సమాజంలోని అన్ని వర్గాల కలలను నెరవేర్చేందుకు బడ్జెట్ సహకరిస్తుందని తెలిపారు.
అమృత్‌కాల్‌లో ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్ అని, భారత అభివృద్ధి కలలను సాకారం చేస్తుందని చెప్పారు. దేశాభివృద్ధికి బలమైన పునాదులు వేస్తుందని ప్రధాని భరోసా వ్యక్తం చేశారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల ప్రజల మహిళల జీవనం కోసం మరిన్ని మెరుగైన చర్యలు తీసుకున్నామని, మహిళా స్వయం సహాయక సంఘాలను మరింత మెరుగుపరిచి, ప్రత్యేక పొదుపు పథకాన్ని ప్రారంభించనున్నామని మోదీ చెప్పారు.
విశ్వకర్మలకు తొలిసారి శిక్షణ, సహాయక పథకాన్ని ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టామని చెప్పారు. మన తృణధాన్యాలకు ప్రపంచంలోనే ఎంతో గుర్తింపు ఉందని, ఇప్పుడు ఈ ‘సూపర్ ఫుడ్’కు ‘శ్రీ అన్న’ అనే పేరుతో కొత్త ఐడెంటిటీ కల్పించామని గుర్తు చేశారు. ఇందువల్ల సేద్యం చేసే చిన్నకారు రైతులు, గిరిజనులు స్త్రీ, పురుషులకు ఆర్థిక పరిపుష్టి కలుగుతుందని స్పష్టం చేశారు.
మధ్యతరగతి వర్గానికి ఉపశమనం కలిగించే పలు చర్యలు కూడా బడ్జెట్లో తీసుకున్నామని, పన్నుల రేట్లు తగ్గించామని, తగిన ఉపశమనం కల్పించామని ప్రధాని చెప్పారు. ఇందువల్ల మధ్యతరగతి ప్రజలు మరింత మెరుగైన జీవనం సాగించగలరని చెప్పారు. ఈ బడ్జెట్ గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ గ్రోత్, గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, గ్రీన్ జాబ్‌లను మరింత ప్రోత్సహించే స్థిరమైన భవిష్యత్తు కోసం సహకరిస్తుందని వివరించారు. 2023-24 బడ్జెట్లో సాంకేతికత, కొత్త ఆర్థిక వ్యవస్థపై దృష్టి సారించామని తెలిపారు.