తెలంగాణ సాధిస్తున్న సమగ్రాభివృద్ధి దేశానికి ఆదర్శప్రాయంగా ఉందని గవర్నర్ డా. తమిళసై సౌందరాజన్ కితాబిచ్చారు.కొంతకాలంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తో సాగుతున్న మాటల యుద్ధం అనంతరం హైకోర్టు జోక్యంతో సయోధ్య కుదరడంతో, రెండేళ్ల తర్వాత రాష్ట్ర అసెంబ్లీలో ఉభయసభలను ఉద్దేశించి ఆమె శుక్రవారం ప్రసంగిస్తూ ప్రతీ రంగంలోనూ దేశం ఆశ్చర్యపోయేలా అద్భుత ప్రగతిని తెలంగాణ సాధిస్తోందని కొనియాడారు.
ప్రజల ఆశీస్సులు, సిఎం కెసిఆర్ పాలనాదక్షత, అంకితభావం వల్లనే అపూర్వ విజయాలు సాధించామన్నారు. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి కొత్త ఆయకట్టును అభివృద్ధి చేశామని ఆమె చెప్పారు. ఆమెకు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, ముఖ్యమంత్రి కేసీఆర్ స్వాగతతం పలికారు.
24 గంటల కరెంటు సరఫరాతో వెలుగు జిలుగుల తెలంగాణ సాధ్యమైందని చెబుతూ దేశానికి అన్నంపెట్టే ధాన్యాగారంగా తెలంగాణ అవతరించిందని గవర్నర్ ఆమె ప్రశంసించారు. వంద శాతం గ్రామాల్లో ఇంటింటికి స్వచ్చమైన తాగు నీరు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మెచ్చుకున్నారు. తెలంగాణ గ్రామాలు అత్యున్నత జీవన ప్రమాణాలతో ఆదర్శంగా మారాయని పేర్కొన్నారు.
పెట్టుబడులకు తెలంగాణ స్వర్గధామంగా మారిందని చెబుతూ ప్రపంచ స్థాయి సంస్థలకు నేడు తెలంగాణ గమ్యస్థానంగా మారిందని, ఐటి రంగంలో మేటిగా తెలంగాణ ప్రగతి పథంలో పరుగులు తీస్తోందని గవర్నర్ తెలిపారు. పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపుదలలో ప్రపంచవ్యాప్త ప్రశంసలు అందుకున్నాయని ఆమె చెప్పారు.
ఆదర్శవంతమైన పరిస్థితికి చేర్చే క్రమంలో తన ప్రభుత్వం అనేక సవాళ్లను దీటుగా ఎదుర్కొన్నదని ఆమె తెలిపారు. ఎనిమిదిన్నరేళ్ల స్వల్ప వ్యవధిలో దేశం నివ్వెరపోయే అద్భుతాలను సాధించామని వివరించారు. సంక్షేమం, అభివృద్ధిలో దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తెలంగాణ రూపుదాల్చిందని పేర్కొన్నారు.
2014-15లో తెలంగాణ ఆదాయం రూ.62 వేల కోట్లు మాత్రమే ఉందని, 2021 నాటి 1 లక్షా 84 వేలకోట్ల రూపాయలకు పెరిగింద, తలసరి ఆదాయం రూ.లక్షా 24 వేల 104 నుంచి రూ.3 లక్షల 17 వేల 115కు పెరిగిందని గవర్నర్ వివరించారు. అన్ని రంగాల్లో అభివృద్ధి గతం కన్నా రెట్టింపు స్థాయిలో పెరిగిందని చెప్పారు.
పెట్టుబడి వ్యయాన్ని పెంచుతూ అనూహ్య ప్రగతిని సాధించిన ప్రభుత్వాన్ని హృదయాపూర్వకంగా అభినందిస్తున్నామని ఆమె తెలిపారు. భారత దేశ చరిత్రలో తెలంగాణ నూతన చరిత్రను లిఖించిందని చెబుతూ గతంలో దండగా అన్న వ్యవసాయాన్ని పండుగలా మార్చింది తన ప్రభుత్వమని ఆమె స్పష్టం చేశారు.