టర్కీకి ఆగ్నేయంగా..సిరియాకి ఉత్తరంగా ఉన్న సరిహద్దు ప్రాంతంలో గంటల గ్యాప్లో వచ్చిన 3 భూకంపాలు ఆ రెండు దేశాలనూ అల్లకల్లోలం చేశాయి. టర్కీ, సిరియా దేశాల్లో ఇప్పటిదాకా 5వేల మందికిపైగా మరణించారు. ఇంకా వేల మంది శిథిలాల కింద చిక్కుకుపోవడంతో మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. దాదాపు 20వేల మంది వరకు మృతుల సంఖ్య ఉండొచ్చనని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేసింది.
తక్షణమే స్పందించిన భారత్ భూకంపాల కారణంగా భవనాలు పెద్దఎత్తున కుప్పకూలి శిథిలాల్లో చిక్కుకున్న వారిని వెలికి తీయడంతో పాటు సహాయక చర్యలు చేపట్టడానికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలను టర్కీ పంపించింది. అలాగే క్షతగాత్రులకు వైద్య సేవలు అందించేందుకు వైద్య సిబ్బందిని కూడా టర్కీ పంపింది. గాయపడిన వారికి అవసరమైన ఔషధాలు, ఇతర సహాయక సామాగ్రి కూడా ఈ బృందాలు భారత్ నుంచి తీసుకెళ్లాయి.
నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫోర్స్ (ఎన్డీఆర్ఎఫ్) కు చెందిన రెండు బృందాలు ప్రత్యేకంగా శిక్షణ పొందిన డాగ్ స్క్వాడ్లు, అవసరమైన పరికరాలతో 100 మంది సిబ్బందిని కలిగి ఉండి సెర్చ్ , రెస్క్యూ ఆపరేషన్ల కోసం భూకంపం ప్రభావిత ప్రాంతానికి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాయని ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
అవసరమైతే మరింత సాయం అందిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ భరోసా ఇచ్చారు. కాగా,భారత్ సాయంపై టర్కీ స్పందిస్తూ భారత్ కు థన్యవాదాలు తెలిపింది. తమని ఆపదలో ఆదుకున్నందుకు భారతదేశాన్ని నిజమైన స్నేహితుడు అని టర్కీ పేర్కొంది.
టర్కీకి భారతదేశం ఇస్తున్న మద్దతు గురించి ప్రస్తావిస్తూ.. భారతదేశంలోని టర్కీ రాయబారి ఫిరత్ సునెల్ ట్వీట్లో కృతజ్ఞతలు తెలిపారు. అవసరంలో ఆదుకున్న వారే నిజమైన స్నేహితులు అని వివరిస్తూ భారతదేశానికి చాలా ధన్యవాదాలు అని పేర్కొన్నారు. ట్విట్టర్లో సునేల్ ..””దోస్త్ అనేది టర్కిష్, హిందీలో ఒక సాధారణ పదం..మనకు ఒక టర్కీ సామెత ఉంది. “దోస్త్ కారా గుండే బెల్లి ఒలూర్” (అవసరంలో ఉన్న స్నేహితుడు నిజమైన స్నేహితుడు). చాలా ధన్యవాదాలు భారత్”అని ట్వీట్ లో తెలిపారు. మరోవైపు,భూకంపం కారణంగా అతలాకుతలమైన సిరియాకు భారత్ వైద్య సామాగ్రిని పంపుతుందని రక్షణ శాఖ అధికారులు మంగళవారం తెలిపారు. ఈరోజు భారత వైమానిక దళానికి చెందిన సి-130జె సూపర్ హెర్క్యులస్ రవాణా విమానంలో సిరియాకు వైద్య సామాగ్రిని భారతదేశం పంపనుందని రక్షణ అధికారులు తెలిపారు
.ఇలా ఉండగా, మంగళవారం బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఈ భూకంపం గురించి ప్రస్తావిస్తూ ప్రధాని మోదీ భావోద్వేగానికి గురయ్యారు. 2001లో గుజరాత్లో సంభవించిన భూకంపం వల్ల జరిగిన నష్టాన్ని గుర్తు చేసుకుంటూ కన్నీరు పెట్టుకున్నారు.