ఫాం హౌస్ కేసును సీబీఐకు అప్పగిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును తెలంగాణ ప్రభుత్వం ఆశ్రయించింది. పిటిషన్ ను వెంటనే వెంటనే విచారణకు స్వీకరించాలని ప్రభుత్వ తరుపు న్యాయవాది దుష్యంతు దవే సీజేఐ ధర్మాసనాన్ని కోరారు. ఈ కేసులో సీబీఐ విచారణ జరిపితే సాక్ష్యాలన్నీ ధ్వసం అవుతాయని పిటిషన్ లో ఆందోళన వెలిబుచ్చారు.
ఈ విషయాలను బుధవారం ధర్మాసనం దృష్టికి తెస్తే వచ్చే వారం విచారణకు అనుమతిస్తామని సీజేఐ స్పష్టం చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సీబీఐకు అప్పగించాలన్న తీర్పుపై స్టే విధించాలంటూ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టులో సవాల్ చేసేందుకు 3 వారాల గడువు కోరింది. ఉదయం హైకోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేసిన సర్కారు సాయంత్రానికి సుప్రీంను ఆశ్రయించింది.
ఎమ్మెల్యేల ఎర కేసు విచారణ సుప్రీంకోర్టులో ఈనెల 17వతేదీన జరుగనుంది. తెలంగాణ ప్రభుత్వం పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారించనుంది. ఈ కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుతో పాటు సమాంతరంగా సుప్రీంకోర్టులోనూ పిటిషన్ వేసింది. అత్యవసరంగా పిటిషన్ ను విచారించాలని ప్రభుత్వం కోరింది. అయితే సాధ్యం కాదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఈనెల 17వతేదీన వాదనలు వినేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది.
ఎమ్మెల్యేల కొనుగోలు కుట్ర కేసులో కేసీఆర్ సర్కార్కు హైకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసును సీబీఐకి బదిలీ చేస్తూ హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును కొట్టేయాలని కోరుతూ.. రాష్ట్ర ప్రభుత్వం, సిట్ దాఖలు చేసిన అప్పీళ్లను హైకోర్టు డివిజన్ బెంచ్ కొట్టేసింది.
ప్రభుత్వ అప్పీల్ పిటిషన్లకు విచారణార్హత లేదని పేర్కొంటూ చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ ఎన్ తుకారాంజీ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం కీలక తీర్పు వెలువరించింది. దీనిపై సుప్రీంకోర్టుకే వెళ్లాలని తేల్చిచెప్పింది.
మరోవంక, హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేసేందుకు వీలుగా సస్పెండ్ చేయాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం మంగళవారం రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇది కూడా బుధవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది. సీబీఐ ఇంకా కేసు నమోదు చేయలేదని హైకోర్టుకు ఏజీ ఈ సందర్భంగా తెలిపారు. ఫైళ్లు అప్పగించాలని సీబీఐ ఒత్తిడి చేస్తోందని అడ్వొకేట్ జనరల్ పేర్కొన్నారు.