అంతర్జాతీయ రేటింగ్ ఎజెన్సీ మూడిస్ అదానికి చెందిన నాలుగు కంపెనీలకు రేటింగ్‌ను స్టెబుల్ (స్థిరత్వం) నుంచి నెగిటివ్ (ప్రతికూల)కు మార్చినట్లు మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ శుక్రవారం వెల్లడించింది. హిండెన్‌బర్గ్ ఆరోపణలతో అదాని గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్, అదానీ గ్రీన్ ఎనర్జీ రిస్ట్రిక్టెడ్ గ్రూపు, అదానీ ట్రాన్స్మిషన్ స్టెప్‌వన్ లిమిటెడ్, అదానీ ఎలక్ట్రిసిటీ ముంబయి లిమిటెడ్ సంస్థలకు ఇచ్చిన రేటింగ్ ఔట్‌లుక్‌ను స్టేబుల్ నుంచి నెగెటివ్‌కు మార్చింది.
అదానీ గ్రూప్ సంస్థల్లో కార్పొరేట్ సుపరిపాలన లోపించిందని హిండెన్‌బర్గ్ ఆరోపించిన సంగతి తెలిసిందే. దీంతో అదానీ గ్రూప్ సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ గణనీయంగా పతనమవుతున్నది. ఇంతకుముందు క్రెడిట్ సూయిజ్, సిటీ బ్యాంక్ సంస్థలు కూడా అదాని గ్రూప్ సంస్థలు జారీ చేసిన బాండ్లకు విలువ లేదని.. వాటిని తనఖా పెట్టుకుని రుణాలు ఇవ్వకూడదని నిర్ణయించిన విషయం తెలిసిందే.
మరోవైపు అదాని కంపెనీల షేర్లను మోర్గాన్ స్టాన్లీ క్యాపిటల్ ఇంటర్నేషనల్ (ఎంఎస్సిఐ) వెయిటేజీని పున:సమీక్షించింది. నాలుగు అదానీ కంపెనీల వెయిటేజీని తగ్గిస్తున్నట్లు పేర్కొంది. వెయిటేజీని తగ్గించడమంటే ఆయా కంపెనీల షేర్లకు పెద్ద ప్రాధాన్యం లేదని నిపుణులు పేర్కొంటున్నారు
ఇలా ఉండగా, అదాని ఎంటర్ప్రైజెస్ ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ (ఎఫ్‌పిఒ) ఉపసంహరణపై మార్కెట్ రెగ్యూలేటరీ సంస్థ సెబీ నిఘా పెట్టిందని తెలుస్తోంది. ఈ పబ్లిక్ ఆఫర్లో పాల్గన్న ఇన్వెస్టరలపై సెబీ దర్యాప్తు చేస్తుందని సమాచారం. అదాని ఎంటర్ప్రైజెస్ భారీగా పడిపోయిన సమయంలోనూ యాంకర్ ఇన్వెస్టర్లు, విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులకు ముందుకు వచ్చారు.
హిండెన్‌బర్గ్ రిపోర్ట్ దెబ్బకు అప్పటికే భారీగా పడిపోతున్న ఈ కంపెనీ షేర్లపై ఇన్వెస్టర్లు ఆసక్తి చూపడం.. ఎఫ్‌పిఒ పూర్తి సబ్స్క్రిప్షన్ కావడం అనుమానస్పదంగా ఉంది. క్లిష్ట సమయంలోనూ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసి)తోనూ రూ.300 కోట్ల పెట్టుబడులు చేయించారు.
రూ.20వేల కోట్ల ఎఫ్‌పిఒలో పాల్గన్న యాంకర్ ఇన్వెస్టర్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ కంపెనీ యాజమాన్యంతో ఎలాంటి సంబంధం ఉండొద్దనేది నిబంధన. ఈ అంశంలోనూ సూక్ష్మ స్థాయిలో పరిశీలన జరుగుతుందని సమాచారం. ఎఫ్‌పిఒలో పాల్గన్న మరో రెండు ఇన్వెస్ట్మెంట్ సంస్థలతోనూ అదాని గ్రూపునకు ఉన్న సంబంధాలపై దర్యాప్తు జరుగుతుందని తెలుస్తోంది. దీనిపై సెబీ, అదానీ గ్రూపు ఎలాంటి ప్రకటన చేయలేదు.
మరోవంక, హిండెన్‌బర్గ్ నివేదిక తరువాత భారీగా షేర్లు పతనం కావడంతో ఇన్వెస్టర్లు నష్టపోయారని దాఖలైన రెండు పిటీషన్ల విచారణకు సుప్రీం కోర్టు అంగీకరించింది. ఇన్వెస్ట ర్లను రక్షించడానికి తీసుకోవాల్సిన చర్యలపై సోమవారం లోగా స్పందించాలని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డు (సెబీ)ని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రతిష్టమైన ప్రేమ్‌వర్క్ ను ఎలా ఏర్పాటు చేయవచ్చో వివరించాలని సుప్రీం కోర్టు కోరింది.
కాగా, హిండెన్‌బర్గ్ చేసిన ఆరోపణలపై అదానీ గ్రూప్ న్యాయపోరాటానికి సిద్దపడుతున్నది. అందుకోసం అమెరికాకు చెందిన న్యాయ సంస్థ వాచ్‌టెల్‌ను నియమించుకుంది. దీన్ని ఎలా ఎదుర్కొవాలో న్యాయ సలహా కోరుఏందుకు అదానీ గ్రూప్ వాచ్‌టెల్‌తో పాటు లిప్టన్, రోసెన్ అండ్ కడ్జ్ న్యాయవాదులను సంప్రదించినట్లు బ్రిటిష్ డైలీ ఒకటి తెలిపింది.