ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి కొడుకు రాఘవరెడ్డిని అరెస్టు చేశారు. ఈ స్కామ్‌తో సంబంధం ఉన్నట్లు భావిస్తున్న సౌత్ గ్రూప్.. మాగుంట రాఘవరెడ్డి పేరును ప్రస్తావించినట్లు తెలిసింది. రాఘవరెడ్డిని అరెస్టు చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్.. ఆయన్ని మధ్యాహ్నం కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిసింది.
ఈ కేసులో వైసిపి ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాస్‌రెడ్డి కొడుకు మాగుంట రాఘవరెడ్డిని గతేడాది అక్టోబర్‌లో సీబీఐ ప్రశ్నించింది. ఆ సమయంలో ఆయనతోపాటూ ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా కూడా సీబీఐ ప్రశ్నించింది. ఇప్పుడు ఈడీ కూడా రంగంలోకి దిగి ఆయన్ని అరెస్టు చేయడం కలకలం రేపుతోంది.
లిక్కర్ కార్టెల్ కోసం.. మధ్యవర్తుల ద్వారా.. రాఘవ రెడ్ ఆప్ ప్రభుత్వానికి లంచాలు ఇచ్చారనే ఆరోపణలున్నాయి. రెండ్రోజులుగా రాఘవరెడ్డిని ప్రశ్నిస్తున్న ఈడీ అధికారులు.. ఆయన సరిగా సహకరించట్లేదనే ఉద్దేశంతో.. ఆయన్ను అరెస్టు చేసినట్లు తెలిసింది.
100 కోట్ల రూపాయలు చేతులు మారినట్లు తెలుస్తున్న ఈ కేసులో ఇప్పటివరకూ నలుగురు అరెస్ట్ అయ్యారు. సౌత్ గ్రూప్‌లో అభిషేక్ బోయినపల్లి, శరత్ చంద్రారెడ్డి, ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు, రాఘవరెడ్డి ఇప్పటివరకూ అరెస్ట్ అయ్యారు.
ఢిల్లీ లిక్కర్ పాలసీ వ్యవహారంలో గత వారంలో సిబిఐ దాఖలు చేసిన అభియోగాల్లో ఎమ్మెల్సీ కవితతో పాటు ఏపీకి చెందిన మాగుంట శ్రీనివాసులు రెడ్డి పేరు కూడా తెరపైకి వచ్చింది. ఢిల్లీ లిక్కర్ వ్యాపారంలో సౌత్ గ్రూప్ పేరిట చక్రం తిప్పడంలో పలువురు ప్రముఖులు కీలక పాత్ర పోషించారని, వ్యాపార ప్రయోజనాలు పొందడానికి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఈడీ ఆరోపిస్తోంది. ఇప్పటికే దాఖలు చేసిన ఛార్జీషీట్లలో పలువురి పేర్లను ప్రధానంగా ప్రస్తావించింది.