కేంద్ర బడ్జెట్‌పై చర్చ సందర్భంగా బీజేపీపై అవినీతి ఆరోపణలు చేస్తోన్న కాంగ్రెస్ సభ్యులపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో విరుచుకుపడ్డారు. తమపై విమర్శలు చేసే ముందు కాంగ్రెస్ నాయకులు తమ ముఖాలను కాస్త డెటాల్ తో కడుక్కోవాలని సూచించారు. అవినీతి గురించి కాంగ్రెస్ నేతలు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని నిర్మలా సీతారామన్ ఎద్దేవా చేశారు.
అవినీతికి ఆద్యులు కాంగ్రెస్ నాయకులేనన్న ఆమె.. అనంతరం బడ్జెట్ ప్రతిపాదనలపై సమాధానాలను ఇచ్చారు. ప్రధాని మోదీ ఆదేశాల మేరకు ఇంధన ధరలను తాము రెండు సార్లు తగ్గించామని ఆమె గుర్తు చేశారు. ఇటీవల హిమాచల్ ప్రదేశ్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాంగ్రెస్.. అధికారంలోకి రాగానే పెట్రోల్ ధరలపై వ్యాట్ పెంచిందని నిర్మలా సీతారామన్ ఆరోపించారు.
దీంతో అక్కడ ఇంధన ధరలు పెరిగాయన్న ఆమె… కాంగ్రెస్ సంప్రదాయం ఇదేనని ధ్వజమెత్తారు. ఆరోపణలు చేస్తారు. సభ నుంచి వాకౌట్ చేస్తారు. అంతేగానీ ఎవరి మాటా వినరంటూ నిర్మలా సీతారామన్ సెటైరికల్ కామెంట్స్ చేశారు.
రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లాట్ బడ్జెట్ ప్రసంగంలో తప్పుల గురించి కూడా నిర్మలా సీతారామన్ ప్రస్తావించారు. రాజస్థాన్ కష్టాల్లో ఉందన్న ఆమె.. తప్పులు ఎవరైనా చేస్తారని, కానీ గతేడాది బడ్జెట్ చదవాల్సిన పరిస్థితి ఎవరికీ రాకుండా ఉండాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నానంటూ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు.
రాజస్థాన్ అసెంబ్లీలో శుక్రవారం బడ్జెట్ ప్రవేశపెట్టిన రాష్ట్ర ముఖ్యమంత్రి గహ్లాట్ .. కొంతసేపు గతేడాది పద్దులోని విషయాలనే చదవడం గందరగోళానికి దారితీసింది. ఈ తప్పిదాన్ని ఓ కాంగ్రెస్ మంత్రి గుర్తించి ప్రసంగాన్ని ఆపించారు.