తెలంగాణ శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్‌గా బండ ప్రకాశ్ ముదిరాజ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శనివారం అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులుకు ఆయన నామినేషన్ పత్రాలు సమర్పించగా, ఆ పదవికి ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ప్రకాశ్ ముదిరాజ్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రకటించారు.
బండ ప్రకాశ్ ముదిరాజ్‌కు అభినందనలు తెలిపిన సీఎం కేసీఆర్ ఆయన్ను స్వయంగా తీసుకెళ్లి ఛైర్మన్ సీట్లో కూర్చోబెట్టారు. అనంతరం మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు, ప్రశాంత్ రెడ్డి, సత్యవతి రాథోడ్, కాంగ్రెస్ పక్ష నేత జీవన్ రెడ్డి తదితరులు ఆయనకు పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందనలు తెలిపారు.
అనంతరం మండలిలో మాట్లాడిన సీఎం కేసీఆర్.. 1969 నుంచి తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారని బండ ప్రకాశ్‌ను కొనియాడారు. మలిదశ ఉద్యమంలోనూ చాలా చురుకైన పాత్ర పోషించారని, మంచి విద్యాధికులుగా పేరు తెచ్చుకున్నారని తెలిపారు. అలాంటి వ్యక్తి మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా ఎన్నికకావటం గర్వకారణంగా ఉందని చెప్పారు. డిప్యూటీ చైర్మన్‌గా సభలో ఫలవంతమైన చర్చలకు అవకాశం కల్పించాలని కోరుకుంటున్నాని తెలిపారు.
ఇదిలా ఉండగా.. బండ ప్రకాష్ ముదిరాజ్ గతంలో రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. 2021 నవంబరులో ఆయన రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా చేసి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2021 డిసెంబరులో ప్రకాశ్ ముదిరాజ్ ఎమ్మెల్సీగా పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. వరంగల్‌కు చెందిన ఆయన.. ముదిరాజ్ సామాజిక వర్గం తరపున పని చేశారు. తాజాగా.. మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు.
శాసన మండలి డిప్యూటీ చైర్మన్‌గా వ్యవహరించిన నేతి విద్యాసాగర్ పదవీకాలం 2021 జూన్‌లో ముగిసింది. ఆ తర్వాతి నుంచి ఈ పదవీ ఖాళీగా ఉంది. ఇప్పుడు ప్రకాశ్ ముదిరాజ్ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు.