సందు దొరికితే తన ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సందించుకునే మాజీ సహచరుడు, ప్రస్తుతం బిజెపి ఎమ్యెల్యే ఈటెల రాజేందర్ పేరును ముఖ్యమంత్రి శాసనసభలో పదే పదే ప్రస్తావించడం కలకలం రేపింది. చివరి రోజైన అసెంబ్లీ సమావేశాలలో లో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ ఈటెల రాజేందర్ పేరును పదే పదే కనీసం డోజన్ సార్లు పైగా పేరును ప్రస్తావించారు.
ముందుగా ఈటల మాట్లాడుతూ, విశ్వవిద్యాలయాలలో డైట్ చార్జీల కోటా పెంచాలని ప్రభుత్వాన్ని కోరారు. దీనిపై స్పందించిన సీఎం కేసీఆర్.. ఈటెల రాజేందర్ సూచనలను ఆహ్వానిస్తున్నామని చెప్పారు. అంతేకాదు, ఈటెలది న్యాయమైన కోరిక గనుక జీవోను జారీ చేయాలని సహచర మంత్రులకు అక్కడే సూచించారు.
ఈటల రాజేందర్ అడిగారని చేయకుండా ఉండొద్దని పేర్కొంటూ కావాలంటే ఈటెలను కూడా పిలిచి సలహా తీసుకోవాలని మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డిలను ఆదేశించారు. తమకు ఎలాంటి భేషజాలు లేవని, మంచి సలహాలు ఇస్తే స్వీకరిస్తామని చెప్పారు.
“మా రాజేందర్ అన్న సందు దొరికితే బద్నాం చేయాలనే ఆలోచనలో ఉన్నారు” అంటూ అభిమానం కూడా చూపించారు. ఎస్సారెస్పీ నుంచి మహారాష్ట్రకు నీళ్లు ఇస్తానన్నావు అని అడుగుతున్నాడు.. దేశంలో నీటి యుద్ధాలు ఎందుకు? అని ప్రశ్నించారు. కిసాన్ సర్కార్ వస్తే తప్ప ఈ దేశం బాగుపడదన్నారు. అందుకే ఆబ్ కి బార్ కిసాన్ సర్కార్ అని పెట్టామన్నారు.
ఏదేమైనా ఈటెలను బిఆర్ఎస్ వైపు ఆకట్టుకొనే ప్రయత్నం కేసీఆర్ చేస్తున్నారా అనే అభిప్రాయం సభలో కలిగించారు. అయితే ఇదంతా తనను అప్రదిష్టపాలు చేసే కుట్ర అని ఈటెల ఆ తర్వాత స్పష్టం చేశారు. పార్టీలు మారే సంస్కృతి తనది కాదని అంటూ తనను టిఆర్ఎస్ నుండి గెంటివేశారు గాని తాను వదిలిరాలేదని గుర్తు చేశారు. అదే విధంగా బీజేపీలో నిబద్ధతగల కార్యకర్తగా పనిచేస్తానని తేల్చి చెప్పారు.
ఒక అబద్ధాన్ని అటు చెప్పగల, ఇటు చెప్పగల నాయకుడు కేసీఆర్ అని.. కెసిఆర్ చేసిన డ్యామేజ్ కడుక్కోవాలంటే ఎన్ని నెలలు పడుతుందోనని అంటూ ఓ విధంగా కేసీఆర్ మాటలపట్ల ఈటెల ఆవేదన వ్యక్తం చేశారు.