ఆసియాలోనే అతిపెద్ద వైమానిక ప్రదర్శనకు కర్ణాటక వేదికయింది. బెంగళూరులోని యలహంక వైమానిక స్థావరంలో జరగనున్న 14వ ఎయిర్ ఇండియా షోను సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఐదురోజులపాటు (ఫిబ్రవరి 13వ తేదీ నుంచి 17వ తేదీ వరకు) జరిగే ఈ ఎయిర్ షోలో 98 దేశాలకు చెందిన 809 రక్షణ, వైమానిక రంగ ప్రదర్శనకారులు పాల్గొననున్నారు.
ఈ సందర్భంగా భారత్ వివిధ దేశాల రక్షణ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకోనుంది. ఈ షోలో చివరి రెండు రోజులైన 16,17 తేదీల్లో సామాన్యులు తిలకించేందుకు కర్నాటక ప్రభుత్వం అవకాశం కల్పించనుంది. నిర్వాహకులు ఎంట్రీ టికెట్‌ను రూ.1000గా నిర్ణయించారు.
‘రక్షణ రంగంలో భారత్ బలోపేతమైంది. తక్కువ ఖర్చుతోనే రక్షణ పరికరాలను భారత్ తయారుచేస్తోంది. రక్షణరంగ సామాగ్రిని విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి మనం చేరుకున్నాం. ఆత్మనిర్భర్ భారత్ ద్వారా ఇక్కడే విమానాలు తయారుచేసుకుంటున్నాం’ అని ప్రధాని మోదీ ఈ సందర్భంగా చెప్పారు.
అలాగే విదేశాలకు ఎగుమతి చేసే రక్షణ సామాగ్రిని ఆరు రెట్లు పెంచామని, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఎన్నో కొత్తపుంతలు తొక్కామని, పరిశ్రమలు ఇచ్చే అనుమతులను సరళతరం చేశామని ఆయన వెల్లడించారు. కేంద్ర బడ్జెట్లోనూ వస్తువుల తయారీ పరిశ్రమలకు పెద్దపీట వేసినట్లు ఆయన చెప్పారు. ఈ సందర్భంగా రక్షణ రంగంలో ప్రైవేటు సంస్థలు పెట్టుబడులు పెట్టాలని ఆయన ఆహ్వానించారు.
ఈ షోకు మొత్తం 109 దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు. ఈ ప్రదర్శనల్లో భారత్‌లో తయారైన యుద్ధ విమానాలు, తేలికపాటి హెలికాప్టర్లను ప్రదర్శించనున్నారు. ఇందులో భాగంగా.. భారత్‌లో తయారైన తేలికపాటి హెలికాప్టర్ ‘ప్రచండ్’ అందరి దృష్టిని ఆకట్టుకుంది. హెలికాప్టర్‌తో పైలెట్లు చేసిన విన్యాసాలు వీక్షకులను అబ్బురపరిచాయి.
కాగా, ఈ షోలో భారతీయ, విదేశీ రక్షణ రంగ సంస్థలు ఎయిర్‌బస్, బోయింగ్, లాక్‌హీడ్, మార్టిన్, ఇజ్రాయెల్ ఏరోస్పేస్, బ్రహ్మౌస్ ఏరోస్పేస్, ఆర్మీ ఏవియేషన్, హెచ్‌సీ రోబోటిక్స్, సాబ్, సఫ్రాన్, సాబ్, సఫ్రాన్, రోల్స్ రాయిస్, ఎల్ అండ్ టీ, భారత్ పోర్జ్ లిమిటెడ్, హెచ్ఏఎల్, బీఈఎల్, బీడీఎల్, బీఈఎంఎల్ సంస్థలు తమ ఉత్పత్తులను ప్రదర్శించనున్నాయి.
ఇక ఇందులో ఇండియన్ పెవిలియన్ ద్వారా 115 సంస్థలు 227 ఉత్పత్తులను ప్రదర్శించనున్నారు. అందులో ఎల్‌ఆర్‌యూ, ఎల్సీఏ-తేజస్, ఎఫ్‌సీఎస్, డిజిటల్ ఫ్లై బై, మల్టీ రోల్ సూపర్ సోనిక్ ఫైటర్, ప్రభుత్వ, ప్రైవేటు రంగ భాగస్వామ్యంతో తయారైన ఉత్పత్తులను ప్రదర్శించనున్నారు.