మరో ఎనిమిది నెలలో మీరు ఎలాగో రాజీనామా చేయాలి, ఇప్పుడు మరో రాజీనామా ఎందుకు? అంటూ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి కెసిఆర్ ని ఎద్దేవా చేశారు. కెసిఆర్ అసెంబ్లీలో మాట్లాడుతూ మోదీ ఆర్ధిక విధానాలను ఎండగడుతూ ప్రధాని విధానాల వల్ల దేశం తిరుగమన దిశలో ఉందని విమర్శించారు.
దీనిపై తాను బిజెపి నేతలతో చర్చకు సిద్దంగా ఉన్నానని చెబుతూ మోదీ అసమర్ధపాలన గురించి తాను ఆధారాలతో వెల్లడించనట్లయితే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానంటూ కేసీఆర్ సవాలు విసిరారు.. దీనిపై కేంద్రమంత్రి ఢిల్లీలో ఘాటుగా స్పందించారు.
”దేశ ఆర్థిక పరిస్థితులపై చర్చకు మేం సిద్ధం. ప్రగతి భవన్ లేదంటే ఫామ్‌హౌజ్‌కు చర్చకు రమ్మంటారా?. అభివృద్ధిపై చర్చకు కేసీఆర్ ఎక్కడకు రమ్మన్నా వస్తాం. రాజీనామా లేఖను జేబులో పెట్టుకుని వస్తే రండి. అసలు కేసీఆర్‌ను రాజీనామా ఎవరు అడిగారు?. వచ్చే ఎన్నికల తర్వాత ఎలాగు రాజీనామా చేయ్సాలిందే” అని కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
కేంద్రంపై బురద జల్లేందుకు అసెంబ్లీని వాడుకున్నారని కేసీఆర్‌పై కేంద్ర మంత్రి మండిపడ్డారు. గత బడ్జెట్లో ఇచ్చిన ఏ హామీని కేసీఆర్ నెరవేర్చలేదని ధ్వజమెత్తారు. కేంద్రాన్ని విమర్శించిన కేసీఆర్ రాష్ట్ర పరిస్థితిపై ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు.. ఎన్నికల్లో ఇచ్చిన హామీల సంగతేంటి? అంటూ ప్రశ్నించారు.
అసెంబ్లీలో కేసీఆర్ పరిధి దాటి మోదీపై మాట్లాడారంటూ మండి పడ్డారు. బడ్జెట్ సమావేశాలా? మోదీ విద్వేష సమావేశాలా?. అంటూ ప్రశ్నలు కురిపించారు.. మీరు ఇచ్చిన హామీలలో నిరుద్యోగ భృతి, దళితులకు మూడెకరాల భూమి ఏమైంది?. అంటు అడిగారు. విద్యార్థుల సమస్యలపై అసెంబ్లీలో ఎందుకు మాట్లాడ లేదంటూ పేర్కొన్నారు.