ఆదాయపన్ను శాఖ అధికారులు ఢిల్లీ, ముంబైల్లోని బిబిసి కార్యాలయాల్లో మంగళవారం సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ పన్నుల విధానంలో అక్రమాలు, బదిలీ ధరలలో అవకతవకలకు సంబంధించిన సర్వే కోసం బిబిసి కార్యాలయాల్లో సోదాలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.
ఈ సర్వే కోసం అధికారులు బిబిసి కార్యాలయాలను మూసివేశారు. ఈ సోదాల్లో జర్నలిస్టుల ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, డాక్యుమెంట్లను ఆదాయపన్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఇందులో పనిచేసే ఉద్యోగులెవరినీ ఆఫీసుకు రావొద్దని ఇన్‌కమ్‌ట్యాక్స్ అధికారులు బిబిసి ఏజెన్సీకి తెలిపారు.
కాగా, ఆదాయపన్ను అధికారుల సోదాల్లో కార్యాలయాలను మూసివేయడం వల్ల..ఉద్యోగులను పనికి దూరంగా ఉండమని బిబిసి సిబ్బందికి పేర్కొంది. ఈ సందర్భంగా.. ‘పనిలో ఉన్నవారు భయపడకండి. మేము ఈ పరిస్థితిని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నాము’ అని బిబిసి వెల్లడించింది.
అయితే ఈ సోదాల వల్ల ఉద్యోగులు ఆందోళన చెందడంతో.. కేవలం సర్వే మాత్రమే అని.. సోదాలు కాదని జర్నలిస్టుల నుంచి తీసుకున్న ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను తిరిగి ఇస్తామని ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు ఉద్యోగులకు తెలిపారు.
అలాగే ఈ సందర్బంగా.. ‘మాకు కొన్ని వివరణలు కావాలి. దానికోసం మా బృందం బిబిసి కార్యాలయాన్ని సందర్శిస్తున్నాము. మేము సర్వే చేస్తున్నాము. మా అధికారులు చెక్ అకౌంట్ బుక్స్‌ని తనిఖీ చేయడానికి వెళ్లారు. ఇవి సోదాలు కాదు. పన్ను అధికారులు బిబిసి ఫైనాన్స్, బ్యాలెన్స్ షీట్ల వివరాలను అడిగారు’ అని ఆదాయపన్ను వర్గాలు తెలిపాయి.
2002 గుజరాత్ అల్లర్లకు సంబంధించి ఇండియా.. ది మోడీ క్వశ్చన్ పేరుతో బీబీసీ డాక్యుమెంటరీ రూపొందించడం పెను దుమారం రేపింది. ఈ వీడియోను కేంద్రం బ్యాన్ చేయగా.. యూట్యూబ్, ట్విట్టర్ లో దీనికి సంబంధించిన లింకులు బ్లాక్ చేసింది. మరోవైపు బీబీసీని సైతం బ్యాన్ చేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు కాగా.. సర్వోన్నత న్యాయస్థానం దాన్ని కొట్టివేసింది. ఈ క్రమంలోనే బీబీసీ ఆఫీసులపై ఐటీ దాడులు జరగడం చర్చనీయాంశంగా మారింది.