బీఆర్ఎస్ తో కాంగ్రెస్ పార్టీ కలవాలని చూస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ కాంగ్రెస్ పార్టీ ఫీల్డ్ నుంచి వెళ్లిపోయిందని ఎద్దేవా చేశారు.
ఏ పార్టీ అయినా గెలుస్తామని చెబుతుందని, కాంగ్రెస్ నేతలు మాత్రం అందుకు విరుద్ధంగా ఓడిపోతామని చెబుతున్నారని గుర్తు చేశారు. ప్రధాని మోదీ నిజాయితీని చూసి ప్రజలు బీజేపీకి ఓటేస్తారని, రాష్ట్రంలోని 119 స్థానాల్లో బీజేపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఓటమి తప్పదని తెలిసి కూడా ఆ పార్టీ నేతలు యాత్రలు ఎందుకు చేస్తున్నారని బండి చురకలంటించారు.
ఎన్నికలకు ముందు వేర్వేరుగా పోటీ చేసి ఆ తర్వాత కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామనడం ప్రజలను మోసం చేయడమేనని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న యాత్రలతో ఎలాంటి ఉపయోగం లేదని స్పష్టం చేశారు. ఎన్నికల వరకు తన్నుకుని, అప్పుడు కలిసి పోటీ చేస్తారని ఎద్దేవా చేశారు. తెలంగాణాలో కాంగ్రెస్ ఉనికి ఎక్కడా లేదని చెబుతూ తెలంగాణలో బిజెపి బలపడుతోందని , అందుకే బిజెపిని కెసిఆర్ టార్గెట్ చేశారని వివరించారు.