ఉమ్మడి కృష్ణా జిల్లాలో టీడీపీకి బలమైన నియోజకవర్గంగా భావించే కైకలూరులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి షాక్ ఇచ్చారు. వైసిపిలో చేరిన టిడిపి మాజీ ఎమ్యెల్యే జయమంగళ వెంటకరమణను వెంటనే పార్టీ ఎమ్యెల్సీ అభ్యర్థిగా జగన్ ప్రకటించారు. ఆయనతో పాటు టిడిపికి చెందిన పలువురు సీనియర్ నేతలు జగన్ సమక్షంలో వైయస్ఆర్ సీపీలో చేరారు.
టీడీపీ సీనియర్ నేత, కైకలూరు మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకట రమణ, టీడీపీ రైతు విభాగం రాష్ట్ర నాయకుడు సయ్యపరాజు గుర్రాజు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి సీఎం సమక్షంలో వైయస్ఆర్ సీపీలో చేరారు. ఈ మేరకు వెంకట రమణ, గుర్రాజుకు కండువాలు కప్పి పార్టీలోకి సీఎం వైయస్ జగన్ ఆహ్వానించారు.
2009లో కైకలూరు నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందిన వెంకట రమణ, ప్రస్తుతం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్‌గా కొనసాగుతున్నారు. ఆయన బుధవారమే టీడీపీ సభ్యత్వానికి, కైకలూరు టీడీపీ ఇంచార్జ్ పదవికి రాజీనామా చేశారు. సయ్యపరాజు గుర్రాజు టీడీపీ రైతు విభాగం రాష్ట్ర నాయకుడిగా పనిచేశారు.
వీరిరువురూ ముఖ్యమంత్రి వైయస్ జగన్ సమక్షంలో వైయస్ఆర్సీపీలో చేరారు. ఈ కార్యక్రమంలో పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు ఉన్నారు. కాగా, వచ్చే ఎన్నికల్లో కైకలూరు టీడీపీ టికెట్‌ను వేరేవారికి కేటాయిస్తారనే ప్రచారం కొంతకాలంగా పెద్దఎత్తున నియోజకవర్గంలో జరుగుతోంది. ఈ పరిణామంతో టీడీపీలో ఆయన కాస్త అసంతృప్తితో ఉన్నారు.
దీంతో వెంకటరమణతో వైసీపీ టచ్‌లో వెళ్లి ఎమ్మెల్సీ టికెట్ ఆఫర్ చేసినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల నేపథ్యంలో పార్టీలోకి వస్తే అవకాశం కల్పిస్తామని వైసీపీ అధిష్టానం హామీ ఇవ్వడంతో సైకిల్ దిగి ఫ్యాన్ గూటికి చేరారు మాజీ ఎమ్మెల్యే. పార్టీలో చేరిన వెంటనే ఎమ్మెల్సీ అభ్యర్ధిగా వెంకటరమణ పేరును జగన్ ప్రకటించారు.
ఆ నియోజకవర్గంలో వెంటరమణ బలమైన సిట్టింగ్ ఎమ్యెల్యేగా ఉండగా 2014లో తిరిగి సీట్ ఇవ్వకుండా, టిడిపికి చెందిన డా. కామినేని శ్రీనివాస్ నామినేషన్ల సమయంలో బీజేపీలో చేరడం, టిడిపి అభ్యర్థిగా బీజేపీలో చేరి మంత్రి పదవి కూడా చేపట్టడం జరిగింది. కేవలం వెంకటరమణకు సీట్ ఎగ్గొట్టడం కోసమే చంద్రబాబు వ్యూహాత్మకంగా శ్రీనివాస్ ను బిజెపిలోకి పంపి, మంత్రిగా చేశారనే ప్రచారం జరిగింది.
ఇప్పుడు కూడా డా. శ్రీనివాస్ చెప్పిన అభ్యర్థికే చంద్రబాబు సీట్ ఇచ్చేఅవకాశం ఉందని తెలియడంతో ముందుగానే మేల్కొని వెంకటరమణ వైసిపిలో చేసినట్టు చెబుతున్నారు.