బీబీసీ కార్యాలయాల్లో ఆదాయపన్ను శాఖ అధికారుల సోదాలు గురువారం రాత్రి ముగిశాయి. ఢిల్లీ, ముంబైలోని ఆఫీసుల్లో మంగళవారం ఉదయం 11.30 గంటలకు ప్రారంభమైన ఈ సోదాలు దాదాపు 60 గంటల పాటు కొనసాగాయి. సోదాల్లో భాగంగా అధికారులు బీబీసీ ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించిన డాటా కాపీలు తీసుకొన్నారు. సంస్థ ఆర్థిక లావాదేవీలు, ఇతర వివరాలపై ఉద్యోగులను ప్రశ్నించారు.
సీనియర్ ఉద్యోగుల స్టేట్మెంట్ను రికార్డు చేయడంతో పాటు పలు పత్రాలను స్వాధీనం చేసుకొన్నారు. మూడు రోజుల పాటు జరిగిన ఈ సర్వేలో పలు డిజిటల్ రికార్డ్‌లు, ఫైల్స్‌ని సర్వే చేశారు ఆదాయపు పన్నుశాఖ అధికారులు. బీబీసీ ఢిల్లీ ఆఫీసుకు చెందిన సీనియర్ ఎడిటర్లతో పాటు మొత్తం మీద 10 మంది ఉద్యోగులు.. మూడు రోజుల తర్వాత ఇళ్లకు చేరుకున్నారు.
అయితే సోదాల గురించి ఐటీ శాఖ నుంచి అధికారిక ప్రకటన రాలేదు. “ఢిల్లీ, ముంబైల్లోని మా కార్యాలయాలను ఐటీశాఖ అధికారులు విడిచిపెట్టి వెళ్లిపోయారు. అధికారులకు మేము సహకరిస్తాము. ఈ వ్యవహారం తొందరగా ముగిసిపోవాలని భావిస్తున్నాము. మేము చాలా సహకరించాము. మాలో చాలా మంది సుదీర్ఘ ప్రశ్నలు ఎదుర్కొన్నారు. రాత్రిళ్లు కూడా ప్రశ్నల వర్షం కురిశాయి” అంటూ బిబిసి ఓ ప్రకటనలో తెలిపింది.
“మా ఉద్యోగుల సంక్షేమం మాకు ముఖ్యం. ఇక ఇప్పుడు మా ఔట్పుట్ సాధారణ స్థితికి చేరింది. భారతీయులకు సేవ చేసేందుకు మేము కట్టుబడి ఉన్నాము. మా ఉద్యోగులు, జర్నలిస్ట్లలకు మేము అండగా ఉంటాము. భయం లేకుండా నివేదికలు అందిస్తాము. అనుకూలత, సానుకూలతలు లేకుండా వార్తలిస్తాము,” అని అందులో పేర్కొన్నది.