రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులను అధికారిక వెబ్సైట్లో పొందుపర్చకపోవడంపై ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. జీవోలు జనానికి తెలియాల్సిన అవసరం ఉందని, ఒకోసారి జీవోలను చూసిన జనం అందులోని అవకతవలను బట్టబయలు చేసేందుకు ఆస్కారం ఉంటుందని అభిప్రాయపడింది.
ప్రభుత్వ ఉత్తర్వుల గురించి తెలుసుకునే హక్కు ప్రజలకు ఉందని, సమాచార హక్కు చట్టం స్ఫూర్తిని ప్రభుత్వం దెబ్బతీయరాదని ఘాటు వ్యాఖ్య చేసింది. వెబ్సైట్లో పెట్టడం ఎంతోకాలంగా వస్తోందని, సాఫీగా జరిగే ఈ ప్రక్రియను ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించింది.
వెయ్యి, రెండు వేల రూపాయల టీఏ, డీఏ బిల్లుల జీవోలే ఒకోసారి పెద్ద అంశాలుగా వెలుగులోకి వచ్చేందుకు వీలుంటుందని, అలాంటి సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పింది. ఉద్యోగులను డిస్మిస్ చేసిన సంఘటనలు ఉన్నాయని గుర్తు చేసింది. గోప్యం, రహస్యంగా ఉంచడం కుదరదని తేల్చి చెప్పింది.
జీవోలన్నింటినీ వెబ్సైట్లో పెట్టే అంశంపై పూర్తి వివరాలను ఈ నెల 28న జరిగే విచారణలోగా నివేదించాలని చీఫ్ జస్టిస్ పీకే మిశ్రా, జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తిల డివిజన్ బెంచ్ ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేసింది.
జీవోలను ప్రభుత్వ వెబ్సైట్లో పొందుపర్చకపోవడం సమాచార హక్కు చట్ట నిబంధనలకు విరుద్ధమని పేర్కొంటూ అనంతపురం జిల్లాకు చెందిన ఎస్.ఆర్.ఆంజనేయులు, నెల్లూరుకు చెందిన జీఎంఎన్‌ఎస్ దేవి, గుంటూరుకు చెందిన కె.శ్రీనివాసరావు విడివిడిగా వేసిన పిల్స్‌ను బుధవారం హైకోర్టు విచారణ చేపట్టింది.
కొన్ని జీవోలను రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం చేసిన వాదనతో డివిజన్ బెంచ్ ఏకీభవించలేదు. ప్రజలకు తెలియాల్సిన జీవోలు రహస్యం ఎలా అవుతాయని ప్రశ్నించింది. టెండర్లు, బ్లాక్ లిస్ట్ కాంట్రాక్టర్లు, కాంట్రాక్టుల జీవోలు ప్రజలకు తెలియాల్సిందేనని చెప్పింది.
ఇది ప్రాథమిక హక్కులతో ముడిపడిన వ్యవహారమని తెలిపింది,
తొలుత పిటిషనర్ల లాయర్లు యు.బాలాజీ, ఉమేష్‌చంద్ర వాదిస్తూ కావాలనే ప్రభుత్వం జీవోలను జీవోఐఆర్ వెబ్సైట్లో పెట్టడం లేదని పేర్కొన్నారు.
పిల్స్ వేస్తున్నందునే ఆ విధంగా ప్రభుత్వం చేస్తోందని ఆరోపించారు. ఇది సమాచార హక్కు చట్ట నిబంధనలకు వ్యతిరేకమని స్పష్టం చేశారు. గవర్నమెంట్ స్పెషల్ ప్లీడర్ చింతల సుమన్ ప్రతివాదన చేస్తూ, జీవోలు కొన్నింటి గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఉందన్నారు.