భారత కాలమానం ప్రకారం రాత్రి 11 గంటలకు మొదలైన ఆరంభ వేడుకలు ఫ్రాన్స్ రాజధాని పారిస్ నగరం వేదికగా మొదలయ్యాయి. ఫుట్‌బాలర్ జిదానే ఒలింపిక్ టార్చ్ పట్టుకుని పరిగెత్తగా..అతన్ని అనుసరిస్తూ కొంత మంది చిన్నారులు పడవలో ప్రయాణించడంతో ప్రారంభోత్సవ కార్యక్రమానికి తెరతీసినట్లు అయ్యింది.
ఫ్రాన్స్ ప్రధాని ఎమాన్యుయెల్ మక్రాన్, అంతర్జాతీయ ఒలింపిక్ సమాఖ్య(ఐవోసీ) అధ్యక్షుడు థామస్ బాచ్ అతిథులతో పాటు అభిమానులను చేతులు ఊపుతూ మార్చ్‌పాస్ట్‌కు స్వాగతం పలికారు. వివిధ దేశాలకు చెందిన అధ్యక్షులు, ప్రధానులు, పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా హాజరయ్యారు.
ఫ్యాషన్‌కు పెట్టింది పేరు అయిన పారిస్ సంస్కృతిని ప్రతిబింబిస్తూ అంతకుముందు జరిగిన షోలో పలువురు క్రీడా ప్రముఖులు తమదైన శైలిలో దుస్తులు ధరించి ఈఫిల్ టవర్ ముందు ఫొటోలు ఫోజులు ఇచ్చారు. ఈ పరేడ్‌లో భారత్ అథ్లెట్లు ఎంతో ఉత్సాహంతో పాల్గొన్నారు. బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు, ఐదో ఒలింపిక్స్ ఆడబోతున్న టేబుల్ టెన్నిస్ లెజెండ్ శరత్ కమల్ ఈ ప్రారంభ వేడుకల్లో భారత బృందానికి నాయకత్వం వహించారు.
ఈ ఇద్దరు భారతదేశ పతాకధారులుగా వ్యవహరించారు. త్రివర్ణ పతాకాన్ని పట్టుకుని ముందు నిలబడ్డారు. వీళ్ల వెనకాలే మన అథ్లెట్ల పడవ ప్రయాణం సాగింది. వీరంతా సంప్రదాయ భారతీయ దుస్తుల్లో మెరిశారు. మహిళలు త్రివర్ణ పతాకంలోని రంగులతో కూడిన చీరను కట్టుకోగా, పురుషులు కుర్తా, పైజామాను ధరించి ఆకట్టుకున్నారు. మొత్తంగా భారత బృందం తరఫున 78 మంది అథ్లెట్లు, ప్రతినిధులు పాల్గొన్నారు.
ఒలింపిక్స్‌కు ఆద్యులైన గ్రీస్ దేశంతో ఒలింపిక్స్ మార్చ్‌పాస్ట్ మొదలైంది. ఆరు కిలోమీటర్ల దూరమైన పరేడ్ అస్ట్రేలిట్జ్ బ్రిడ్జ్ నుంచి మొదలైంది. సీన్ నదికి ఇరువైపులా ఉన్న అతిథులు, అభిమానులకు అభివాదం చేస్తూ ఆయా దేశాల ప్లేయర్లు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పడవల్లో ముందుకు సాగారు. తమ దేశ జాతీయ జెండాలను చేతబూని ఈలలు, కేరింతలు, హర్షధ్వానాలతో అలరించారు.
గ్రీస్ తర్వాత ఐవోసీ రెఫ్యూజీ టీమ్ వరుస క్రమంలో వచ్చింది. ఫ్రెంచ్ అక్షర క్రమాన్ని అనసరిస్తూ ఆయా దేశాలకు చెందిన అథ్లెట్లు తమకు ఏర్పాటు చేసిన పడవల్లో ప్రయాణించారు. భారత్ తరఫున సింధు, శరత్ కమల్ పతకాధారులుగా వ్యవహరించారు.
85 బోట్లు, 6800 మంది అథ్లెట్లు: సీన్ నదిని ఆధారంగా చేసుకుంటూ ప్రముఖ అర్టిస్టిక్ డైరెక్టర్ థామస్ జాలీ ప్రారంభ కార్యక్రమాన్ని రూపుదిద్దారు. మొత్తం 85 బోట్లు 6800 మంది అథ్లెట్లను మోసుకుంటూ ముందుకు సాగాయి. ఇందులో 205 దేశాలకు చెందిన అథ్లెట్లు, సహాయక సిబ్బంది, అధికారులు ఉన్నారు.
చారిత్రక క్యాథ్రడెల్ నోట్రె డేమ్ ద్వారా బోట్లు ప్రయాణించాయి. ఓవైపు వరుణుడు అంతరాయం కల్గించినా ఏ మాత్రం జోష్ తగ్గకుండా ఆటగాళ్లు చిరునవ్వుతో ముందుకు సాగారు. పారిస్ ఆరంభ వేడులకు అట్టహాసంగా చేసేందుకు ఫ్రాన్స్ ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. మార్చ్‌పాస్ట్ జరిగే ప్రాంతాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుంది. మొత్తంగా 3 లక్షల మంది వీక్షించే అవకాశమున్న నేపథ్యంలో అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేశారు.