మహారాష్ట్ర శివసేనలోని ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే వర్గానికి అసలమైన శివసేన పార్టీగా ఎన్నికల కమీషన్ గుర్తింపు ఇచ్చింది. దానితో పాటు శివసేనకు చెందిన పార్టీ పేరును, ఎన్నికల గుర్తు విల్లు-బాణంను కూడా కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. దానితో మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే ఈ విషయమై చేసిన పోరాటంలో పరాజయం ఎదుర్కొనక తప్పలేదు.
ప్రస్తుతం శివసేన రూపొందించుకున్న నిబంధనలు, ఆ పార్టీ అమలు చేస్తోన్న అంతర్గత రాజ్యాంగం అప్రజాస్వామికమని ఎన్నికల కమిషన్ అధికారులు వ్యాఖ్యానించారు. పార్టీ అంతర్గతంగా ఎలాంటి ఎన్నికలను కూడా శివసేన నిర్వహించలేదని పేర్కొన్నారు. అలాంటప్పుడు పార్టీ అగ్ర నాయకత్వం రూపొందించుకున్న నియమ నిబంధనలు, మార్గదర్శకాలేవీ పరిగణనలోకి తీసుకోలేమని స్పష్టం చేశారు.
దీనిపట్ల ఉద్ధవ్ థాకరే వర్గానికి చెందిన శివసేన నాయకులు తీవ్రంగా స్పందించారు. ఇలాంటి ఉత్తర్వులు వెలువడతాయని తాము ముందే ఊహించామని పేర్కొంటూ కేంద్ర ఎన్నికల కమిషన్ పై తమకు ఎలాంటి నమ్మకం లేదని ఉద్ధవ్ థాకరే వర్గానికి చెందిన శివసేన అధికార ప్రతినిధి ఆనంద్ దుబే చెప్పారు.
ఎన్నికల గుర్తు కేటాయింపు వ్యవహారం ప్రస్తుతం సుప్రీంకోర్టులో విచారణ దశలో ఉందని, అలాంటప్పుడు ఈసీ అధికారులు దీనిపై ఎలా నిర్ణయం తీసుకుంటారని ఆయన ప్రశ్నించారు. సుప్రీంకోర్టు ఇప్పటివరకు గుర్తు కేటాయింపుపై ఎలాంటి తుది నిర్ణయాన్ని తీసుకోలేదని గుర్తు చేశారు. బీజేపీ కార్యకర్తలుగా ఈసీ అధికారులు పని చేస్తోన్నారనేది ఈ ఉదంతంతో మరోసారి స్పష్టమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు.