ప్రపంచ కుబేరుల జాబితాలో అదాని స్థానం తాజాగా 25కు పడిపోయిందని ఫోర్బ్స్ రియల్‌టైం బిలియనీర్ ఇండెక్స్ తెలిపింది. గుజరాత్‌కు చెందిన ఈ పెట్టుబడిదారుడు నెల క్రితం 147 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.12 లక్షల కోట్ల పైగా) సంపదతో ప్రపంచంలోనే రెండో స్థానంలో, ఆసియాలో అతిపెద్ద కుబేరుడిగా ఉన్నారు.
అయితే, పలు ఆర్ధిక అవకతవకలకు పాల్పడిన్నల్టు హిండెన్‌బర్గ్ రిపోర్ట్ వెల్లడించినప్పటి నుండి అదాని కంపెనీలు స్టాక్ మార్కెట్లో రోజురోజుకు బొక్కబోర్ల పడుతున్నాయి. దీంతో వరుస పతనంతో అదాని సంపద తాజాగా 50 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.3.9 లక్షల కోట్లు)కు పడిపోయిందని ఫోర్బ్స్ సోమవారం వెల్లడించింది. కాగా, ముకేశ్ అంబానీ ప్రపంచంలో 85 బిలియన్ డాలర్ల సంపదతో ఎనిమిదో స్థానంలో నిలిచారు.
హిండెన్‌బర్గ్ తన రిపోర్ట్ కారణంగా జాతీయ, అంతర్జాతీయ ఇన్వెస్టర్లు విశ్వాసాన్ని కోల్పోవడంతో అదాని గ్రూపు కంపెనీల్లోని షేర్లను కొనడానికి ఎవరూ ఆసక్తి చూపడం లేదు. ఈ ప్రభావంతో ఆ స్టాక్స్ విలువ నెల రోజులగా క్రమంగా పడిపోతోంది. సోమవారం అదాని ఎంటర్ప్రైజెస్ షేర్ విలువ మరో 6.37 శాతం లేదా రూ.109.70 పతనమై రూ.1,613కు దిగజారింది. 2022 నవంబర్‌లో ఈ స్టాక్ రూ.4,190 గరిష్ట స్థాయి వద్ద ట్రేడింగ్ అయ్యింది.
అదాని ట్రాన్స్మిషన్, అదాని టోటల్ గ్యాస్, గ్రీన్ ఎనర్జీ సూచీలు పడిపోతూనే ఉన్నాయి. అదానీ గ్రూప్‌లోని తొమ్మిది స్టాక్స్ నష్టాల్లోనే ముగిశాయి. అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ ట్రాన్స్మిషన్ ఐదు శాతం మేర నష్టపోయాయి. ఎన్డిటివి 3.75 శాతం, అదానీ విల్మార్ 2.38 శాతం, అంబుజా సిమెంట్ 1.09, అదానీ పవర్ ఐదు శాతం, అదానీ పోర్ట్స్ 0.24 శాతం, ఎసిసి 0.87 శాతం చొప్పున నష్టాలతో ముగిశాయి.