ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలతో ముడిపడిన మనీ లాండరింగ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పిఎ బిభవ్ కుమార్ను గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడి) అధికారులు ప్రశ్నించారు. మనీ లాండరింగ్ నిరోధక చట్టం(పిఎంఎల్ఎ) నిబ్బంధన కింద బిభవ్ కుమార్ వాంగ్మూలాన్ని ఇడి అధికారులు నమోదు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఉమ ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, కేజ్రీవాల్ పిఎ బిభవ్ కుమార్తోసహా కనీసం 36 మంది నిందితులు వేలాది కోట్ల రూపాయల ముడుపులు పుచ్చుకున్నారని, ఇందుకు సంబంధించిన సాక్ష్యాధారాలను చెరిపివేసేందుకు 170 సెల్ఫోన్లను ధ్వంసం చేశారని ఇడి తన చార్జిషీట్లో ఆరోపించింది. ఈ ఆరోపణలకు సంబంధించి బిభవ్ కుమార్ను ఇడి ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ కేసులో ఇప్పటివరకు ఈడి రెండు చార్జిషీట్లను దాఖలు చేసింది. మొత్తం తొమ్మిదిమంది నిందితును అరెస్టు చేసింది. కాగా, ఈ కేసులో విచారణకు ఆదివారం హాజరుకావాలని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత మనీశ్ సిసోడియాను సీబీఐ ఇప్పటికే కోరింది. ఈ విచారణకు తాను హాజరవుతానని సిసోడియా ప్రకటించారు. ఆయనను సీబీఐ గత ఏడాది అక్టోబర్ 17న ఇంతకు ముందు ప్రశ్నించింది.