దేశంలో తిరస్కరణకు గురైన వారిని మళ్లీ అంగీకరించేందకు ప్రజలు సిద్ధంగా లేదంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ‘మోదీ సమాధి తవ్వుతాం అంటూ కాంగ్రెస్ నినాదాలు చేస్తున్నా.. దేశం మాత్రం మోదీ కమలమే వికసిస్తుందంటూ ఎలిగెత్తి చెబుతోంది’ అంటూ చెప్పుకొచ్చారు.
మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌లో బిజెపి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ కాంగ్రెస్ నాయకుడు పవన్ ఖేరా పేరును, ఆయన అరెస్టును ప్రస్తావించకుండా కాంగ్రెస్‌పై ఆరోపణలు గుప్పించారు. దేశంలోని ప్రజలు ‘మీ కమలం వికసిస్తోంది’ అంటున్నారంటూ కౌంటరిచ్చారు.
తమపై, తమ పార్టీపై అభ్యంతరకరమైన పదజాలం, విమర్శలు చేసిన వారికి దేశం తగిన విధంగా సమాధానం చెబుతుందని ప్రధాని హెచ్చరించారు. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పవన్ ఖేరాను ఢిల్లీ విమానాశ్రయంలో గురువారం ఛత్తీస్‌గఢ్ వెళ్లే విమానం ఎక్కకుండా అడ్డుకోవడంతో ఆ పార్టీ సభ్యులు మోదీపై వివాదాస్పద నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌పై ప్రధాని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
కుటుంబమే ఫస్ట్ అంటూ కాంగ్రెస్ ముందుకెళ్తుంటే.. మేఘాలయ ప్రభుత్వం మాత్రం ప్రజలే ఫస్ట్ అనే నినాదానికి పిలుపునిస్తోందని తెలిపారు. తన రోడ్ షోకు హాజరైన ప్రజలకు, పార్టీ శ్రేణులకు మోదీ ధన్యవాదాలు తెలిపారు. తనపై చూపిన ప్రేమ, ఆశీర్వాదాలకు మేఘాలయాను మరింత అభివృద్ధి పథంలోకి తీసుకువచ్చి.. కృతజ్ఞతలను చెల్లించుకుంటాం అని హామీ ఇచ్చారు.
ఢిల్లీ నుంచి రిమోట్ కంట్రోల్ తో నాగాలాండ్
కాగా, ఢిల్లీ నుంచి నాగాలాండ్ ను రిమోట్ కంట్రోల్ తో నడిపించిందని ప్రధాని విమర్శించారు. ఈశాన్య రాష్ట్రాలను ఏటీఎంలా వాడుకుందని ధ్వజమెత్తారు. శుక్రవారం చుమోకెదిమా జిల్లాలో ప్రధాని మోడీ బహిరంగ సభలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ హయాంలో నాగాలాండ్ రాష్ట్రంలో రాజకీయ అస్థిరత ఉండేదని గుర్తు చేశారు.
ఢిల్లీ నుంచి దిమాపూర్ వరకు వారసత్వ రాజకీయాలు నిర్వహిస్తూ, అభివృద్ధికి ఉద్దేశించిన నిధులను కాజేశారని ప్రధాని ఆరోపించారు. ప్రశాంతత, అభివృద్ధి, శ్రేయస్సు అనేవి నాగాలాండ్ కు సంబంధించి బిజెపి పాటించే మంత్రాలుగా ప్రధాని పేర్కొన్నారు. అందుకే బీజేపీ పట్ల నాగాలాండ్ ప్రజల్లో నమ్మకం పెరిగినట్టు చెప్పారు.
నాగాలాండ్ లో శాశ్వత శాంతి స్థాపనకు ఎన్డీయే సర్కారు కృషి చేస్తోందని చెబుతూ.. అందులో భాగంగా రాష్ట్రంలో సాయుధ దళాల చట్టం (ప్రత్యేక అధికారాలు) 1958ని పూర్తిగా ఎత్తేసినట్టు ప్రకటించారు. ‘‘టెక్నాలజీ సాయంతో బిజెపి ఈశాన్య ప్రాంతంలో అవినీతిని కట్టడి చేసింది. కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద ప్రజలు నేరుగా తమ బ్యాంకు ఖాతాలకు నిధులు పొందుతున్నారు’’ అని ప్రధాని తెలిపారు. ఈ బహిరంగ సభను బిజెపి, దాని భాగస్వామ్య పార్టీ ఎన్డీపీపీ సంయుక్తంగా నిర్వహించాయి.
మేఘాలయలో ఈనెల 27న నాగాలాండ్‌తో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 2న ఓట్ల లెక్కింపు జరగనుంది.