సంపదపై దురాశే అవినీతిని ప్రోత్సహిస్తూ క్యాన్సర్‌గా వృద్ధి చెందడానికి దోహదపడిందని సర్వోన్నత న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసింది. న్యాయస్థానాలు అవినీతిని ఏమాత్రం సహించకూడదని, దేశ ప్రజల తరపున బాధ్యతగా ఉంటూ ఇటువంటి నేరాలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరించాల్సి ఉందని స్పష్టం చేసింది.
ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలపై ఛత్తీస్‌గఢ్ మాజీ ప్రధాన కార్యదర్శి అమన్‌సింగ్, ఆయన భార్యపై నమోదైన ఎఫ్ఐఆర్ను ఆ రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది. దీనిని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను శుక్రవారం సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎస్ రవీంద్రభట్, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన సుప్రీం ధర్మాసనం విచారించింది.
ఛత్తీస్‌గఢ్ హైకోర్టు తీర్పును పక్కనబెట్టింది. ఈ సందర్భంగా కొన్ని కుంభకోణాలను ప్రస్తావించిన సుప్రీంకోర్టు ధర్మాసనం వాటిపై దర్యాప్తు జరుగుతున్న తీరు బాధ కలిగిస్తోందని అభిప్రాయపడింది. రాజ్యాంగ పీఠిక హామీ ఇచ్చినట్లుగా ప్రజలకు సామాజిక న్యాయం కల్పించడంలో అవినీతి అనేది తీవ్ర అవరోధంగా మారుతోందని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది.
”సంపద అందరికీ సమానంగా అందాలనే రాజ్యంగ పీఠిక సమన్యాయ హామీ ఇప్పటికీ అందని ద్రాక్షగానే మిగిలింది. అందుకు ఎన్నో కారణాలు ఉన్నప్పటికీ దాన్ని సాధించడానికి ప్రధాన అవరోధం మాత్రం అవినీతే. ఈ అవినీతి.. కేవలం పాలనా రంగానికే పరిమితం కాలేదు. దురదృష్టవశాత్తు ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఏదో రూపంలో భాగమైందని పౌరులే చెప్పే స్థాయికి చేరింది” అని తెలిపింది.
అవినీతి మూలాలపై పెద్దగా చర్చ చేయడం అవసరం లేనప్పటికీ సంపదపై దురాశ అనేది అవినీతి క్యాన్సర్‌గా వృద్ధి చెందేందుకు దోహదం చేస్తోందని పేర్కొంది. ప్రజాసేవలో ఉన్నవారిలో కొంతమంది వ్యక్తిగత ప్రయోజనాల కోసం వెంపర్లాడటంపై అత్యున్నత న్యాయస్థానం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.