రాష్ట్రీయ జనతాదళ్ జాతీయ అధ్యక్షుడు, బిహార్ మాజీ ముఖ్యమంత్రి, మాజీ రైల్వే మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ను సీబీఐ త్వరలో విచారించే అవకాశం ఉన్నది. జాబ్ ఫర్ ల్యాండ్ కేసులో కేసులో ఇటీవల ఆయనకు సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో మాజీ ముఖ్యమంత్రిని విచారించే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాల సమాచారం.
ఈ కేసులో లాలూ సతీమణి, బిహార్ మాజీ సీఎం రబ్రీదేవిని సోమవారం దాదాపు ఐదు గంటల పాటు విచారించింది. ఆ తర్వాత మీడియాతో మాట్లాడేందుకు సీబీఐ అధికారులు నిరాకరించారు. జాబ్ ఫర్ ల్యాండ్ కేసులో లాలూ, రబ్రీదేవి, మిసా భారతి సహా 14 మంది నిందితులుగా చేర్చారు.
మార్చి 15న లాలూ ప్రసాద్, ఆయన భార్య రబ్రీ దేవి, కుమార్తె మిసా భారతిని కోర్టుకు హాజరుకావాలని కోరింది. మేరకు సీబీఐ నోటీసులు పంపింది. తొలుత ఈ విచారణ సీబీఐ కార్యాలయంలో జరగాల్సి ఉండగా అనంతరం విచారణ నిమిత్తం రబ్రీ నివాసానికి అధికారుల బృందం చేరుకున్నది.
2004-2009 మధ్య యూపీఏ ప్రభుత్వంలో లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా పని చేసిన విషయం తెలిసిందే. లాలూ రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో రైల్వే రిక్రూట్మెంట్లో కుంభకోణం జరిగింది. దరఖాస్తుదారుల నుంచి ఉద్యోగాల కోసం డబ్బులు కాకుండా భూములు, ప్లాట్లు తీసుకున్నారని తీసుకున్నారనే విమర్శలున్నాయి.
ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టిన సీబీఐ లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుమార్తె మిసా భారతిపై కేసు నమోదు చేసింది. భూములను రబ్రీదేవి, మిసా భారతి పేరిట తీసుకున్నారని విమర్శలున్నాయి. ఈ కేసులో విజయ్ సింగ్లా సహా పది మందిపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.