కెఎంసి పిజి మెడికల్ విద్యార్ధిని ప్రీతి ఆత్మహత్య చేసుకున్న రోజునే మరణించిందని, అయితే ప్రభుత్వం చికిత్స పేరుతో డ్రామాలాడిందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు నిరసనగా ఆయన సోమవారం రాష్ట్ర పార్టీ కార్యాలయంలో నిరశన దీక్ష చేశారు.
ఈ దీక్షలో ఎమ్మెల్యే ఈటెల రాజేందర్, డా. కె లక్ష్మణ్, బిజెపి నేతలు కొండా విశ్వేశ్వరరెడ్డి, విజయశాంతి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి మాట్లాడుతూ, పోలీసులు ముందే స్పందించి ఉంటే వైద్య విద్యార్థిని ప్రీతి చనిపోయి ఉండేది కాదని చెప్పారు. వైద్య విద్యార్థిని ప్రీతి మరణానికి ఇప్పటికీ కారణాలు తెలియటం లేదన్న బండి పీజీ మెడికో ఆత్మహత్య చేసుకునేంత పిరికి విద్యార్థిని కాదని స్పష్టం చేశారు.
చనిపోయిన ప్రీతికి నాలుగు రోజుల పాటు చికిత్స చేసి నాటకం ఆడారని ఆరోపణలు చేశారు. మహిళలపై ఎన్ని దాడులు జరుగుతున్నా సీఎం కేసీఆర్ ఎందుకు స్పందించడంలేదని ప్రశ్నించారు. తెలంగాణలో ఏ సమస్య వచ్చినా ముందుగా స్పందించేది తమ పార్టీ మాత్రమేనని తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే బుల్ డోజర్లతో నిందితులకు తగిన బుద్ది చెబుతామని హెచ్చరించారు.
రాష్ట్రంలో పూటకో హత్య, గంటకో రేప్ జరుగుతుందని పేర్కొంటూ ఆ రేపిస్టులంతా బీఆర్ఎస్ లోనే ఉన్నారని మండిపడ్డారు. ఇక బీఆర్ఎస్ మరోసారి రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఆ రేపిస్టులకు రివార్డ్ కూడా ఇస్తారేమో అంటూ ఎద్దేవా చేశారు. ఇటీవల చనిపోయిన మెడికో స్టూడెంట్ ప్రీతి కుటుంబానికి ప్రభుత్వం కేవలం రూ.10 లక్షలు ఇచ్చిందని, అయితే సీఎం కేసీఆర్ కుమార్తె కవిత పెట్టుకునే వాచ్ కు రూ.20 లక్షలు అంటూ మనిషి ప్రాణానికి రూ.10 లక్షలా అని బండి ప్రశ్నించారు.