దేశవ్యాప్తంగా కలకలం రేపిన ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రముఖులను అదుపులోకి తీసుకున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తాజాగా మరో కీలక వ్యక్తిని అరెస్ట్ చేసింది. హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లైని ఈడీ మంగళవారం నాడు అదుపులోకి తీసుకుంది. ఈ కుంభకోణంలో కవిత ప్రతినిధిగా పేర్కొంటున్న పిళ్ళై అరెస్ట్ తో తర్వాత కవిత వంతనే ప్రచారం జరుగుతుంది.
లిక్కర్ స్కామ్‌లో అవకతవకలపై అరుణ్ రామచంద్ర పిళ్లైను ఇటీవల రెండు రోజుల పాటు ప్రశ్నించిన ఈడీ అధికారులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. రామచంద్ర పిళ్లై అరెస్ట్‌తో లిక్కర్ పాలసీ మనీలాండరింగ్ కేసులో అరెస్టుల సంఖ్య 10కి చేరింది.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మొదటి నుంచి ఈ అరుణ్ రామచంద్ర పిళ్లై పేరు తరచుగా వినిపిస్తూనే ఉంది. మాగుంట శ్రీనివాసుల రెడ్డి, రాఘవ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత, అరబిందో శరత్‌చంద్రారెడ్డిలతో కూడిన సౌత్ గ్రూప్ ద్వారా రూ.100 కోట్ల ముడుపులను ఆప్ నేతల తరఫున విజయ్‌నాయర్ స్వీకరించారనేది ఈడీ ప్రధాన అభియోగం.
ఈ గ్రూప్‌నకు ప్రాతినిధ్యం వహించిన వారిలో అరుణ్ రామచంద్ర పిళ్లై ఒకరని ఈడీ ఆధారాలతో సహా సీబీఐ ప్రత్యేక న్యాయస్థానానికి ఇప్పటికే సమర్పించింది. సౌత్ గ్రూప్ భాగస్వాములు ఆప్ నేతలతో కలిసి కుట్రకు పాల్పడ్డారని స్పష్టం చేసింది. ఈడీ నివేదికలో పేర్కొన్న వివరాల ప్రకారం ఈ అరుణ్ రామచంద్ర పిళ్లై మద్యం తయారీ కంపెనీ ఇండోస్పిరిట్స్ సంస్థకు అన్నీ తానై వ్యవహరిస్తున్నట్లు ఈడీ పేర్కొంది. ఈ కంపెనీలో 32.5 శాతం షేర్ పిళ్లైదే కావడం గమనార్హం.
హైదరాబాద్‌కు చెందిన ఈ వ్యాపారవేత్త మనీ లాండరింగ్‌కు పాల్పడి ప్రజాప్రతినిధులకు ఢిల్లీలో లిక్కర్ లైసెన్సుల విషయంలో అక్రమ మార్గంలో మేలు చేశాడనేది పిళ్లైపై ఉన్న ప్రధాన అభియోగం. సీబీఐ చెబుతున్న ప్రకారం.. ఎక్సైజ్ శాఖ అధికారులతో కలిసి ‘ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ 2021-22’ని రూపొందించడంతో పాటు అమలు చేయడంలో కూడా పిళ్లై కీలక పాత్ర పోషించినట్లు సమాచారం.
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్ట్ అయిన ప్రముఖ వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లైను ఈడీ అధికారులు రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చారు. ‘‘బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రతినిధినంటూ అరుణ్ రామచంద్ర పిళ్ళై అంగీకరించారు… ఆయనను ఏడు రోజుల కస్టడీకి ఇవ్వండి. కేసు దర్యాప్తుకు సహకరించడం లేదు. మనీ ట్రయల్స్ గుట్టు తేల్చడానికి కస్టడీ అవసరం. రూ.25 కోట్లు నేరుగా ట్రాన్స్ఫర్ చేశారు’’ అంటూ ఈడీ వాదనలు వినిపించింది.
రామచంద్ర పిళ్లైకి రౌస్ అవెన్యూ కోర్టు 7 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఈ హైదరాబాద్ వ్యాపారవేత్త అరెస్ట్‌తో ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవిత అరెస్ట్ కావడం ఖాయమనే ప్రచారం మరోమారు సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది.