గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి ఆధారాల్లేకుండా 27 వేలకుపైగా బర్త్, 4వేలకుపైగా డెత్ సర్టిఫికెట్లను జారీ చేయడం పట్ల బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విస్మయం వ్యక్తం చేశారు. జారీ చేసిన బర్త్ , డెత్ సర్టిఫికెట్లలో ఎక్కువగా పాతబస్తీలోనే బయటపడటం తీవ్రమైన ఆందోళన కలిగించే అంశమని పేర్కొన్నారు.
కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యానికి, జీహెచ్ఎంసీలో పేరుకుపోయిన అంతులేని అవినీతికి ఇది నిదర్శనం అని విమర్శించారు. దీనికంతటికి మొదటి ముద్దాయిగా నైతిక బాధ్యత వహించి సీఎం పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బర్త్ సర్టిఫికెట్లతో పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఉగ్రవాదులు పాస్ పోర్టులు పొంది, హైదరాబాద్ లో అడుగుపెట్టి పాతబస్తీని అడ్డగా మార్చి దేశంలో అల్లర్లు స్రుష్టించేందుకు పెద్ద కుట్ర జరుగుతోందని ఆరోపించారు.
కేసీఆర్ పాలనలో పాతబస్తీ ఐఎస్ఐ కేంద్రంగా మారిందని, స్లీపర్ సెల్స్ ను పెంచి పోషిస్తున్నారని పేర్కొంటూ దేశంలో ఎక్కడ బాంబు పేలుళ్లు జరిగినా ఇక్కడే మూలాలు బయటపడుతున్నాయని గుర్తు చేశారు. ఓట్ల కోసం, సీట్ల కోసం కేసీఆర్ పాతబస్తీని ఎంఐఎంకు ధారాదత్తం చేశాడని ధ్వజమెత్తారు.
టాస్క్ ఫోర్స్ దాడి చేసిన కొన్ని మీ సేవా కేంద్రాల్లోనే 31 వేల బర్త్, డెత్ సర్టిఫికెట్లు బయటపడ్డాయంటే పాతబస్తీ మొత్తం జల్లెడ పడితే లక్షల్లో ఇలాంటి సర్టిఫికెట్లు బయటపడే అవకాశం ఉందని చెప్పారు. వీటితోపాటు రేషన్ కార్డులు, ఓటర్ ఐడీ కార్డులు కూడా పొంది పాతబస్తీ పౌరులుగా చలామణి అవుతూ హైదరాబాద్ సహా ప్రధాన నగరాలన్నింటిల్లో అల్లర్లు స్రుష్టించి భారతదేశాన్ని విచ్చిన్నం చేసేందుకు పెద్ద కుట్ర చేసినట్లు తెలుస్తోందని సంజయ్ ఆరోపించారు.
తక్షణమే పాతబస్తీలో జారీ చేసిన బర్త్, డెత్ సర్టిఫికెట్లతోపాటు రేషన్ కార్డు, ఓటర్ కార్డులపై సమగ్ర దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పెద్దల, ఎంఐఎం నేతల హస్తం లేనిదే ఇంత పెద్ద సంఖ్యలో సర్టిఫికెట్లు జారీ చేసే అవకాశం లేనందున సీబీఐతో విచారణ జరిపిస్తేనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని స్పష్టం చేశారు.