మరో ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఆంధ్ర ప్రదేశ్ లో తన ఎన్నికల వ్యూహంపై పదునుపెట్టేందుకై జనసేన 10వ ఆవిర్భావ సదస్సును ఈ నెల మచిలీపట్నంలో పెద్ద ఎత్తున జరిపేందుకు భారీ సన్నాహాలు చేస్తున్నారు. సుమారు ఐదు లక్షల మంది హాజరు కాగలరని భావిస్తున్న ఈ సదస్సులో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తన రాజకీయ విధానంపై కీలకమైన ప్రకటనలు చేయగలరని భావిస్తున్నారు.
రాష్ట్ర భవిష్యత్తు, మన బిడ్డల భవిష్యత్తు పై పాలకులు ఏం చేయాలో దిశ నిర్దేశం చేసేలా జనసేన పదవ ఆవిర్భావ సభ ఏర్పాటు చేశామని ఆ పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. మచిలీపట్నంలోసదస్సు ఏర్పాట్లను పరిశీలించిన నాదెండ్ల ఉమ్మడి కృష్ణాజిల్లా విస్తృస్థాయి సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ గత సంవత్సరం ప్రజల పక్షాన నిలబడి పోరాడిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రజా సమస్యలు పరిష్కరించే విధంగా జనసేన ముందు వరుసలో నిలబడి పోరాడింది చెబుతూ రాష్ట్ర చరిత్రలో కని విని ఎరగని విధంగా బహిరంగ సభకు ఐదు లక్షల మంది ప్రజలు వస్తారని అంచనా వేస్తున్నట్లు చెప్పారు.
34 ఎకరాల్లో బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నామని, మరో 60 ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాటు చేయడానికి కూడా రైతులు ముందుకు వచ్చి స్వచ్ఛందంగా తమ భూములను అందజేశారని తెలిపారు. సభకు వచ్చిన వీర మహిళలు, జనసైనికులు, ప్రజలు తిరిగి గమ్యస్థానం సురక్షితంగా వెళ్లేలా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామాని పేర్కొ న్నారు.
అధినేత పవన్ కళ్యాణ్ 14వ తేదీ రెండు గంటలకు మంగళగిరి వారాహి వాహనం పై బయలుదేరి సభా ప్రాంగణానికి సాయంత్రం ఐదు గంటలకు చేరుకుంటారని తెలిపారు. కృష్ణా జిల్లాలో ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతులకు ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయలు ఆర్థిక సహాయాన్ని వేదిక మీద పవన్ కళ్యాణ్ అందజేస్తారని చెప్పారు.
జగన్మోహన్ రెడ్డి అధికారంలో వచ్చిన అనంతరం రాష్ట్రంలో మూడు వేల మంది రైతుల ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. కృష్ణాజిల్లాలో ప్రభుత్వ లెక్కల ప్రకారం 51 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్లు గుర్తించినట్లు చెప్పారు. తమ పార్టీ బృందం ఆత్మహత్యల వాస్తవ లబ్ధిదారులను గుర్తించేందుకు సర్వే చేస్తున్నట్లు తెలిపారు.
పార్టీలో కష్టపడి పనిచేసిన వారిని గుర్తించనున్నట్లు చెప్పారు. 25 మంది క్రియాశీలక సభ్యులు ఇచ్చిన ఆరు వేల మందికి ప్రత్యేకంగా స్పెషల్ పాసులు ఇచ్చి వారికి ప్రత్యేకించి గ్యాలరీని ఏర్పాటు చేశారు. ఐటీ, సోషల్ మీడియాలో తమ సేవలందిస్తున్న వారి కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. మచిలీపట్నం పరిసరాల లోని 10 నియోజకవర్గాల నుంచి ప్రత్యేకంగా జన సేకరణ చేయనున్నట్లు మనోహర్ తెలిపారు.
ప్రతి నియోజకవర్గానికి రాష్ట్ర కమిటీ నుంచి ఇద్దరు సమయకర్తలను, జిల్లా కమిటీ నుంచి ఒక సభ్యుడు కేటాయించి,ఆ ముగ్గురు కలిసి సభ విజయవంతం గ్రామాల్లో పర్యటిస్తారని తెలిపారు. పోలీసు శాఖ సూచనలు అనుగుణంగా బారికెట్లు, లైటింగ్, మౌలిక వసతులు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు.