హెచ్ 3ఎన్2 ఇన్ఫ్లూయెంజా వైరస్ దేశంలో క్రమంగా వ్యాప్తి చెందుతున్నది. దీని కారణంగా ఇద్దరు వ్యక్తులు మరణించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వర్గాలు శుక్రవారం ప్రకటించాయి. హర్యానాలో ఒకరు, కర్ణాటకలో ఒకరు మరణించినట్లు ఆ వర్గాలు తెలిపాయి.
దేశంలో సుమారు 90 హెచ్3ఎన్2 వైరస్ కేసులు నమోదవగా, ఎనిమిది హెచ్1ఎన్1 కేసులను గుర్తించినట్లు పేర్కొన్నాయి. గత కొన్ని నెలలుగా దేశంలో ఫ్లూ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయని, వీటిలో అధికంగా హాంకాంగ్ ఫ్లూ (హెచ్3ఎన్2) వైరస్ కారణంగా వస్తున్నాయని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) తెలిపింది.
అధిక శాతం మంది ఆస్పత్రిలో చేరుతున్నారని, ప్రస్తుతం దేశంలో హెచ్3ఎన్2, హెచ్1ఎన్1 వైరస్లు విస్తృతి కొనసాగుతోందని పేర్కొంది.దగ్గు, చలి జ్వరం, శ్వాసకోశ ఇబ్బందులు, శ్వాసలో గురక వంటి లక్షణాలతో పాటు వికారం, గొంతు నొప్పి, విరేచనాలు, వాంతులు, తీవ్రమైన అలసట ఈ వైరస్ లక్షణాలుగా పేర్కొంది.
ఈ లక్షణాలు వారం రోజులు కొనసాగే అవకాశం ఉందని, ఇది చాలా వేగంగా వ్యాప్తి చెందుతోందని తెలిపింది. కరోనా తరహాలో జాగ్రత్తలు పాటించాలని, మాస్కు ధరించడం, శుభ్రత పాటించడం అవసరమని వైద్యులు సూచించారు. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారితో పాటు వృద్ధులు, చిన్నపిల్లలకు వైరస్ సోకే అవకాశాలు అధికంగా ఉన్నాయని హెచ్చరించారు.