తెలంగాణాలో ముందస్తు ఎన్నికలకు వెళ్ళబోతున్నామని జరుగుతున్న ప్రచారంపై బిఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు తెరదించారు. శుక్రవారం జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఈ మేరకు కేసీఆర్ స్పష్టం చేశారు. షెడ్యూల్ ప్రకారమే ఆగస్టు-సెప్టెంబర్ లో ఎన్నికల నోటిఫికేషన్ రావొచ్చని తెలిపారు.
ప్రజాప్రతినిధులందరూ ఆయా నియోజకవర్గాల్లో పాదయాత్రలకు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు లేవని.. షెడ్యూల్ ప్రకారమే ఉంటాయని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. హైదరాబాద్ బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఈ మేరకు ప్రకటన చేశారాయన.
ఎమ్మెల్యేలు అందరూ నియోజకవర్గాల్లోనే ఉండాలని, ప్రతి ఎమ్మెల్యే పాదయాత్ర చేయాలని కేసీఆర్ ఆదేశించారు. ఎన్నికల వరకు ప్రజల్లోనే ఉండాలని.. ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ ముందుకు సాగాలని కోరారు కేసీఆర్. నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించాలని కీలక నేతలకు సూచించారు.
అదే విధంగా ఎమ్మెల్యేలు.. మండల, గ్రామ స్థాయిలో సమావేశాలు, సభలు నిర్వహించి ప్రజా సంక్షేమ పథకాలను జనానికి వివరించాలని కేసీఆర్ దిశానిర్ధేశం చేశారు. ఏప్రిల్ 27వ తేదీన వరంగల్ లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఆ రోజు ప్లీనరీ సమావేశం రద్దు చేస్తున్నట్లు తెలిపారు.
ఎమ్మెల్యేలు, పార్టీ ప్రజాప్రతినిధులు అందరూ ఎన్నికలకు సన్నద్ధం కావాలని, ఆ దిశగా ప్రణాళికలతో ముందుకు వెళ్లాలని సూచించారు. ఎన్నికలకు కేవలం తొమ్మిది నెలలు మాత్రమే సమయం ఉందని, అప్రమత్తంగా ఉండాలని చెప్పారు.
వాస్తవానికి తెలంగాణ అసెంబ్లీకి ఈ ఏడాది చివరిలో ఎన్నికలు జరగనున్నాయి.
ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై ఆరోపణలు వచ్చాక ఈ రాజకీయ వాతావరణం వేడెక్కింది. కవిత ఈడీ విచారణ, అరెస్ట్ ఊహాగానాలతో త్వరలోనే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లొచ్చనే ప్రచారం జరిగింది. ముఖ్యంగా.. కేసీఆర్ గురువారం నాడు హఠాత్తుగా క్యాబినెట్ భేటీ నిర్వహించడం, మరుసటి రోజు శుక్రవారమే బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశానికి పిలుపునివ్వడం ఈ ఊహాగానాలకు ప్రధాన కారణమైంది.