తీవ్రమైన ఆర్ధిక సంక్షోభం, ద్రవ్యోల్భణం ఎదుర్కొంటున్న పాకిస్థాన్ లో 33 రకాల వస్తువులపై అమ్మకపు పన్నును 17 శాతం నుండి 25 శాతానికి పెంచినట్లు ప్రభుత్వం ప్రకటించింది. దిగుమతి చేసుకున్న ఆహారంతో పాటు అలంకార వస్తువులు, అత్యాధునిక మొబైల్ ఫోన్స్, ఇతర ఉత్పత్తులపై ఈ పన్ను విధిస్తున్నట్లు తెలిపింది.
అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) నుండి రుణం కోసం పాక్ యత్నిస్తోంది. అయితే 7 బిలియన్ డాలర్ల రుణం సదుపాయం కింద 1.1 బిలియన్ డాలర్లను విడుదల చేయాలంటే పాక్ ప్రభుత్వం ఐఎంఎఫ్ సూచనలను పాటించాల్సి వుంది. దీంతో ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాక్ ప్రభుత్వం ఈ రుణాన్ని పొందేందుకు ప్రజలపై భారాలు మోపేందుకు సిద్ధమైంది. ఈ పెంచిన పన్ను బుధవారం నుండి అమల్లోకి వస్తాయని పాకిస్తాన్ ఫెడరల్ బోర్డ్ ఆఫ్ రెవెన్యూ (ఎఫ్బిఆర్) ఓ ప్రకటనలో తెలిపింది.
33 రకాల వస్తువులతో పాటు స్థానికంగా తయారైన లేదా అసెంబుల్ చేసిన ఎస్యువిలు, సియువిలు, 1,400 సిసి మరియు అంతకంటే ఎక్కువ ఇంజిన్ సామర్థ్యం కలిగిన స్థానికంగా తయారైన వాహనాలు, డబుల్ కేబిన్ కలిగిన వాహనాలపై కూడా 25 శాతం పన్ను విధిస్తున్నట్లు ఎఫ్బిఆర్ తెలిపింది.
దిగుమతి చేసుకున్న లగ్జరీ వస్తువులపై పన్నులు పెంచడం ద్వారా రూ. 7 బిలియన్లు, స్థానికంగా తయారైన వాహనాలపై పన్ను ద్వారా రూ. 4 బిలియన్లు పొందవచ్చని ఎఫ్బిఆర్ అంచనా వేస్తోంది. ఇంధనం, విద్యుత్ టారిఫ్ల పెంపు, ఎగుమతి మరియు విద్యుత్ రంగాల్లో సబ్సిడీలను ఎత్తివేయడంతోపాటు ఆదాయ పెంపు కోసం ఇప్పటికే పాక్ ప్రజలపై ఇతర పన్నుల భారాలను మోపుతున్న సంగతి తెలిసిందే.
