తెలంగాణాలో నేరస్తులు సత్యాగ్రహులుగా వ్యవహరిస్తున్నారని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ ఎద్దేవా చేశారు. కెసిఆర్ పాలనలో ఆయన కుటుంబం తెలంగాణను దోచుకున్నారని ఆరోపించారు. ధనదాహంతో ఆప్ నేతలతో కలిసి దోపిడిలో చేరేందుకు న్యూఢిల్లీలో కుంభకోణం చేశారని ఆరోపించారు.
ఈడీ కార్యాలయాలకు వెళ్లే ముందు మనీష్ సిసోడియా ర్యాలీలు నిర్వహిస్తారు. కవిత వెంట పార్టీ అగ్రనేతలు వెళ్తారని ఎద్దేవ చేశారు. అయితే, ప్రజలు తెలివైనవారని, అవినీతికి సంబంధించిన నిజానిజాలు తెలుసుకుంటారని హెచ్చరించారు.
స్మార్ట్ సిటీ కోసం కేంద్రం నిధులిస్తుంటే కెసిఆర్ సర్కారు ఆ నిధులను పక్కదారి పట్టిస్తోందని బిజెపి రాష్ట్ర ఇన్‌ఛార్జి తరుణ్ చుగ్ ఆరోపించారు. వరంగల్ పోచమ్మ మైదాన్‌లోని రాణిరుద్రమ దేవి విగ్రహానికి పూలమాల వేసి ఆయన నివాళులర్పించారు.
అనంతరం లోక్ సభ ప్రవాస్ యోజనలో భాగంగా వరంగల్ లోక్ సభ నియోజకవర్గ స్థాయి కోర్ కమిటీ సభ్యులతో తరుణ్ చుగ్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితపై ఈడీ విచారణ చేస్తుంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తుందని ధ్వజమెత్తారు. లిక్కర్ స్కాంలో విచారణ కోసం పిలిస్తే ఆ విచారణ సంస్థలపై సిఎం కెసిఆర్ ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.