దేశంలో ప్రజాస్వామ్యం పడిందంటూ గతవారం లండన్‌లో కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ చేసిన ప్రసంగాన్ని ప్రస్తావిస్తూ, ఆయన క్షమాపణ చెప్పాలని అధికార బిజెపి సభలు పార్లమెంట్ ఉభయ సభల్లో డిమాండ్ చేయడంతో గందరగోళ పరిస్తితులు నెలకొన్నాయి. బడ్జెట్ మలివిడత సమావేశాలు సోమవారం ప్రారంభం కాగా, ఉభయసభల్లోనూ బిజెపి నాయకులు ఈ విషయాన్ని ప్రస్తావించారు.
మరోవైపు ప్రతిపక్ష పార్టీలు అదానీ అక్రమాలు, కేంద్ర ఏజెన్సీల దుర్వినియోగం తదితర అంశాలపై అధికారపక్షాన్ని నిలదీశాయి. దీంతో పోటాపోటీ నినాదీలతో పార్లమెంటు దద్ధరిల్లింది. ‘భారత ప్రజాస్వామ్యం ముప్పులో ఉంది’ అని విదేశీ పర్యటనలో అన్నందుకు కాంగ్రెస్ అగ్రనేత కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలని కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేసింది.
రెండో విడత బడ్జెట్ సమావేశాలు ఆరంభం కాగానే రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ లండన్‌లో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ‘రాహుల్ గాంధీ ఈ సభ సభ్యుడు, ఆయన లండన్‌లో భారత్‌ను అవమానించారు. అక్కడ ఆయన చేసిన వ్యాఖ్యలు ఖండనీయమని నేను భావిస్తున్నాను, ఈ సభలోని వారందరూ ఆయనను క్షమాపణ చెప్పాలని కోరాలి’ అని ఆయన స్పష్టం చేశారు.
కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ ‘లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుల మైక్రోఫోన్లను స్పీకర్ పనిచేయకుండా ఆపేస్తున్నారని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు ఆక్షేపణీయం’ అంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. లోక్‌సభలో రాహుల్ గాంధీ మాట్లాడేందుకు అనేకసార్లు అవకాశం ఇచ్చారని పేర్కొంటూ ఆయన మైక్రోఫోన్లను ఎప్పుడూ ఆపేయలేదని తెలిపారు.
‘2013లో సభలో ఓ ఆర్డినెన్స్‌ను రాహుల్ గాంధీ చింపేశారు, ఆ సమయంలో ప్రజాస్వామ్యం ఎక్కడున్నట్లు?’ అని నిలదీశారు. కాగా బిజెపి సభ్యులు సభ వెల్‌లోకి ప్రవేశించి రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాల్సిందేనంటూ నినాదాలు చేశారు. రణగొణుల మధ్య స్పీకర్ ఓమ్ బిర్లా సభను మధ్యాహ్నం 2.00 గంటల వరకు వాయిదా వేశారు.
రాజ్య సభ ప్రారంభమైన వెంటనే కేంద్ర మంత్రి పియూష్ గోయల్ భారత ప్రజాస్వామ్యంపై చేసిన వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దేశంలో ఎమర్జెన్సీ విధించిన సమయంలో ప్రజాస్వామ్యం ఏమైంది? చట్టాల ప్రతులను చించేసినప్పుడు ప్రజాస్వామ్యం ఏమైంది? అప్పుడు ప్రజాస్వామ్యం పోయిందే కానీ, ఇప్పుడు కాదంటూ ఆయన వ్యాఖ్యానించారు.
గోయల్ వ్యాఖ్యలను రాజ్యసభలో ప్రతిపక్ష నేత ఖర్గే ఖండించారు. సభలో సభ్యులు కాని వ్యక్తిని పిలిచి క్షమాపణ చెప్పాలని అడగటం ఏమిటని నిలదీశారు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ కేంబ్రిడ్జ్ యూనివర్శిటీలో ప్రసంగిస్తూ భారత ప్రజాస్వామ్యం ముప్పులో ఉందన్నారు. తనతో సహా అనేక మంది నాయకులు నిఘాలో ఉన్నారని పేర్కొన్నారు. ఇదిలావుండగా ప్రతిపక్ష సభ్యులు కేంద్రంపై నిరసన వ్యక్తం చేశారు. అదానీ గ్రూప్ సంక్షోభంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జెపిసి)తో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
ఈ పరిణామాలు మధ్య పార్లమెంటు ఉభయసభలు ముందుగా మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదాపడ్డాయి. ఆ తర్వాత సభలు ప్రారంభమైనప్పటికీ మళ్లీ అదే పరిస్థితి రిపీట్ అయ్యింది. దాంతో లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ సభలను మంగళవారం ఉదయం 11 గంటల వరకు వాయిదా వేశారు.