విజయ నగరం జిల్లా నెల్లిమర్ల మండలం రామతీర్థం కొండపై జరిగిన ఘర్షణలకు సంబంధించి కేంద్ర మాజీ మంత్రి, టిడిపి సీనియర్ నేత పూసపాటి అశోక్ గజపతిరాజుపై పోలీసులు కేసులు నమోదు చేశారు. వైసిపి ప్రభుత్వం మొదటి నుంచి మాన్సాస్ ట్రస్టు చైర్మన్ ,రామతీర్థం అనువంశిక ధర్మకర్తగా ఉన్న అశోక్ గజపతిరాజును ఇరుకున పెట్టే ప్రయత్నాలు చేస్తూనే ఉంది.
ఆయనను అర్ధాంతరంగా ఆ పదవుల నుండి తొలగించి, హైకోర్టు మొట్టికాయలు వేయడంతో గత్యంతరం లేక తిరిగి నియమించింది. వీటికిగల విలువైన ఆస్తులను కాజేయడం కోసమే ఆయనను తప్పించే ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
బుధవారం మండలంలోని రామతీర్థం బోడికొండపై కోదండరాముని ఆలయ పునర్నిర్మాణ శంకుస్థాపన సందర్భంగా శిలాఫలకం బోర్డు ఏర్పాటును ఆయన అడ్డుకున్నారు. సరైన ప్రొటోకాల్ అనుసరించలేదని అధికారులతో వాదనకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది.
ఈ ఘటన నేపథ్యంలో అశోక్‌పై రామతీర్థం ఆలయ ఈవో ప్రసాద్‌రావు నెల్లిమర్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆలయ ధర్మకర్త అశోక్‌పై రెండు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ప్రభుత్వ విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా.. ఆస్తి ధ్వంసం, గందరగోళం సఅష్టించారని కేసులు నమోదయ్యాయి.
శిలాఫలకం బోర్డును ఆలయ అనువంశిక ధర్మకర్త, టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు పూసపాటి అశోక్‌గజపతిరాజు అడ్డుకున్నారు. దీంతో, అశోక్ అనుయాయులు, వైసిపి నాయకుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. గత ఏడాది డిసెంబర్ 29న రామతీర్థం కొండపైగల కోదండరామస్వామి విగ్రహ శిరస్సును గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేసిన విషయం విదితమే.
ఇదే ప్రదేశంలో కోదండరామస్వామి ఆలయం నిర్మిస్తామని అప్పట్లో ప్రభుత్వం చెప్పింది. బుధవారం శంకుస్థాపన చేసేందుకు సిద్ధమైంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, డిప్యూటీ సిఎం పాముల పుష్పశ్రీవాణి, మంత్రి బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్యేలు, కలెక్టర్, పలువురు అధికారులు పాల్గొన్నారు.
కార్యక్రమానికి ముందుగా అక్కడికి చేరుకున్న అశోక్ గజపతిరాజు శంకుస్థాపన ఫలకం బోర్డును ప్రభుత్వం తరపున ఏర్పాటు చేయడంపై మండిపడి బోర్డును తోసేశారు. సమీపంలోవున్న వైసిపి నాయకులు, పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా స్వల్ప తోపులాట చోటుచేసుకుంది.
అధికారులు, దేవాదాయ శాఖ సర్కస్ కంపెనీలా మారి కీలుబొమ్మలాట ఆడుతున్నారని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు తీరు మార్చుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. అనంతరం అశోక్ గజపతి రాజు రామస్వామిని దర్శించుకున్నారు.
తర్వాత, మంత్రులు వెల్లంపల్లి, బొత్స విలేకర్లతో మాట్లాడుతూ అశోక్‌గజపతిరాజు ఆలయ నిర్మాణాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని, అందుకే శంకుస్థాపన బోర్డును ధ్వంసం చేయబోయరని ఆరోపించారు. ఆహ్వానపత్రం ఇవ్వడానికి వెళ్లినవారిపైనా, ఇష్టానుసారం చిందులు వేశారని తెలిపారు.
ప్రోటోకాల్ ప్రకారం అశోక్‌గజపతిరాజును ఈ కార్యక్రమానికి ఆహ్వానించామని, ఆయన పేరును సైతం నిబంధనల ప్రకారం శిలాఫలకంపై వేశామని చెప్పారు.
ఈ సంఘటన పట్ల బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్యెల్సీ పివిఎన్ మాధవ్ విచారం వ్యక్తం చేశారు. చైర్మన్‌గా ఉన్న అశోక్‌ను ఆహ్వానించి అవమానపర్చటం ఏమిటని ప్రశ్నించారు.