కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీకి ఢిల్లీ పోలీసులు నోటీసులు పంపించారు. భారత్ జోడో యాత్ర సందర్భంగా చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఈ నోటీసులను పంపించినట్లు వెల్లడించారు.
రాహుల్ గాంధీ చేపట్టిన దేశవ్యాప్త పాదయాత్ర భారత్ జోడో యాత్ర జనవరిలో కశ్మీర్ లో ముగిసిన విషయం తెలిసిందే. ఆ సందర్భంగా కశ్మీర్లో రాహుల్ గాంధీ ప్రసంగిస్తూ.. మహిళలపై లైంగిక దాడులు కొనసాగుతూనే ఉన్నాయని ఆరోపించారు.
ఆ వ్యాఖ్యలపై ఢిల్లీ పోలీసులు స్పందిస్తూ లైంగిక హింసకు గురైన బాధితుల వివరాలను ఇస్తే, వారి నుంచి వివరాలు తీసుకుని, దోషులను పట్టుకుంటామని పేర్కొంటూ, రాహుల్ గాంధీకి నోటీసులు పంపించారు. లైంగిక దాడికి గురైన బాధితులకు న్యాయం చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
భారత్ జోడో యాత్రలో చేసిన ప్రసంగంతో పాటు, సోషల్ మీడియా పోస్ట్ లను ఉటంకిస్తూ, రాహుల్ గాంధీకి ఒక ప్రశ్నావళిని ఢిల్లీ పోలీసులు పంపించారు. లైంగిక హింసకు గురైన మహిళల వివరాలు ఇవ్వాలని అందులో ఆయనను కోరారు.