మరో భారతీయ సంతతికి చెందిన మహిళకు అమెరికా ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. అమెరికా ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కమిషన్ డిప్యూటీ చీఫ్‌గా నిషా దేశాయ్ బిస్వాల్‌ను ఎంపిక చేస్తూ బైడెన్ ఆదేశాలు జారీ చేశారు.
ఈ మేరకు వైట్‌హౌస్ ఓ ప్రకటన విడుదల చేసింది. ఒబామా హయాంలోనూ బిస్వాల్ కీలక బాధ్యతలు నిర్వహించారు. అప్పట్లో ఆమె దక్షిణ, మధ్య ఆసియా వ్యవహారాలకు సంబంధించి అసిస్టెంట్ సెక్రెటరీ ఆఫ్ స్టేట్‌గా పనిచేశారు. విదేశాంగ విధానం, అంతర్జాతీయ అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణలో ఆమె 30 ఏళ్లకు పైగా అనుభవం గడించారు.
ప్రస్తుతం బిస్వాల్ అమెరికా ఛాంబర్ ఆఫ్ కామర్స్ నేతృత్వంలోని అంతర్జాతీయ వ్యూహం మరియు ప్రపంచ చొరవ కార్యక్రమానికి సీనియర్ ఉపాధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు. ఆమె అసిస్టెంట్ సెక్రటరీగా ఉన్న సమయంలో సెంట్రల్ ఆసియాతో సి51 సదస్సు, అమెరికా బంగ్లాదేవ్ భాగస్వామ్య సదస్సుకు బాధ్యత వహించారు.
అలాగే బిస్వాల్ యుఎస్ ఏజన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ (యుఎస్ఎఐడి)లో ఆసియాకు అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటర్‌గా ఉన్నారు. దక్షిణ, మధ్య, ఆగేయాసియా అంతటా యుఎస్ఎఐడి కార్యకలాపాలు నిర్వహించడంతో పాటు పర్యవేక్షించారు.