దేశవ్యాప్తంగా విద్యాసంస్థల్లో వివక్షత కు తావులేకుండా, విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై దృష్టి సారించడానికి అమలు చేయాల్సిన కార్యాచరణ ప్రణాళిక రూపొందించడానికి కేంద్ర విద్య, నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం జరిగింది. ఫిర్యాదుల పరిష్కారానికి సమిష్టి బాధ్యతతో పనిచేసే విధంగా ఒక వ్యవస్థకు రూపకల్పన చేయాలని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీచేశారు.
వ్యవస్థ అభివృద్ధి కోసం సంబంధిత వర్గాల నుంచి ఆన్లైన్ విధానంలో సలహాలు, సూచనలు తీసుకోవాలని మంత్రి సూచించారు. లింగ సమానత్వం, కుల సున్నితత్వం, విద్యాపరమైన ఒత్తిడిని తగ్గించడం, పటిష్టమైన కౌన్సిలింగ్ వ్యవస్థ మొదలైన వివిధ అంశాలను ప్రధాన్ ప్రస్తావించారు. విద్యార్థుల శారీరక, మానసిక ఆరోగ్య అంశాలకు ప్రాధాన్యత ఇస్తూన్న విద్యా మంత్రిత్వ శాఖ దీనికోసం చర్యలు అమలు చేస్తుందని తెలిపారు.
విద్యాపరమైన ఒత్తిడిని తగ్గించేందుకు విద్యా మంత్రిత్వ శాఖ ఎప్పటికప్పుడు పలు చర్యలు అమలు చేస్తోంది. పాఠాలు నేర్చుకోవడంలో విద్యార్థులకు సహకారం అందించడం, 13 ప్రాంతీయ భాషల్లో సాంకేతిక విద్య అంశాలు ప్రవేశపెట్టడం, 13 భాషల్లో ప్రవేశ పరీక్షలు నిర్వహించడం, , విద్యార్థులకు మానసిక ఉల్లాసాన్ని అందించడం, మానసిక ఆరోగ్య సంబంధిత సమస్యల నివారణ, గుర్తింపు మరియు పరిష్కార చర్యలపై మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది.
సామాజిక అంశాలు,ప్రవర్తనలో మార్పు లాంటి ముఖ్యమైన సంఘటనలు విద్యార్థి దశలో చోటుచేసుకుంటాయి. విద్యార్థులు తమ భవిష్యత్తుకు సంబంధించి తీసుకునే నిర్ణయాలపై పలు అంశాలు ప్రభావితం చూపుతాయి. ఈ సమయంలో విద్యార్థులు మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండాల్సి ఉంటుంది.
దీనికోసం ఒత్తిడి, ఆందోళన, నిరాశ మొదలైన అంశాలకు విద్యార్థులు దూరంగా ఉండాలి. విద్యాపరమైన ఒత్తిడి, తోటివారి ఒత్తిడి, తీవ్రమైన పోటీ విద్యా వాతావరణం, ప్రవర్తనా సమస్యలు, పనితీరు సమస్యలు విద్యార్థుల మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే సమస్యలుగా వుంటాయని గుర్తించారు.
మంత్రి ఆదేశాల మేరకు విద్యార్థుల మానసిక, భావోద్వేగ అంశాల పరిరక్షణ కోసం పాఠశాల నుంచి ఉన్నత విద్యా సంస్థల వరకు అమలు జరిగే విధంగా సమగ్ర కార్యాచరణ ప్రణాళిక అమలు చేసేందుకు విద్యా మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలు సిద్ధం చేస్తోంది. భౌతిక, సామాజిక, వివక్ష, సాంస్కృతిక , భాషా పరంగా ఎదురయ్యే సమస్యల వల్ల కలిగే మానసిక క్షోభ వల్ల విద్యార్థులు తమను తాము హింసించుకోవడం,, / స్వీయ-విధ్వంసక ధోరణులకు దారితీసే అంశాలను దృష్టిలో ఉంచుకుని విద్యా శాఖ ముసాయిదా మార్గదర్శకాలు రూపొందిస్తుంది.
దీనిలో భాగంగా వివక్షతకు తావు లేని వ్యవస్థను రూపొందించడం, అధ్యాపకుల సామర్థ్యాన్ని పెంపొందించే కార్యక్రమాలు, ఓరియంటేషన్, కౌన్సిలింగ్, తక్షణ జోక్యం కోసం సమస్యను ముందస్తుగా గుర్తించే విధానాలు, విద్యార్థులు అధ్యాపకుల మధ్య సంబంధాలు మెరుగుపరచడం, వ్యాయామ శిక్షణ అందించడం, సమర్థవంతమైన , వేగవంతమైన ఫిర్యాదుల పరిష్కార విధానం అమలు చేయడం ఫిజికల్ ఫిట్నెస్ నిబంధనలు మరియు కార్యక్రమాలు, పోషణపై దృష్టి; సంస్థల అధిపతులు, అధ్యాపకులు, తల్లిదండ్రులు మొదలైన వారి వ్యక్తిగత ప్రమేయం, పర్యవేక్షణ లాంటి అంశాలకు ప్రాధాన్యత ఇస్తారు.