మా నౌకరీలు మాగ్గావాలే నినాదంతో.. ఈ నెల 25న ఇందిరాపార్క్ వద్ద “నిరుద్యోగ మహా ధర్నా” నిర్వహిస్తున్నట్లు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజీ నేపథ్యంలో బిజెపి మరో ఆందోళనకు సిద్ధమైంది. బుధవారం జరిగిన సమావేశంలో పార్టీ నేతలతో రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పేపర్ లీకేజీ, మీడియా సంస్థలపై దాడులు, జర్నలిస్టుల అరెస్ట్ వంటి అంశాలపై చర్చించారు.
పేపర్ లీకేజీ కేసులో సిట్ ఇప్పటి వరకు సాధించిందేమీ లేదని, సీఎం సిట్ అంటే సిట్.. స్టాండ్ అంటే స్టాండ్ గా సిట్ దర్యాప్తు ఉందని ఎద్దేవ చేశారాయన. టీఎస్ పీఎస్ పేపర్ లీక్ కేసులో తాము సిట్ దర్యాప్తును ఒప్పుకోవట్లేదని స్పష్టం చేశారు. హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయాలని సంజయ్ డిమాండ్ చేశారు.
నయీం కేసు, మియాపూర్ భూకుంభకోణం, డ్రగ్స్ కేసులో సిట్ దర్యాప్తు ఏమైందని ప్రశ్నించారు. తప్పు చేయనప్పుడు సిట్టింగ్ జడ్జితో ఎందుకు విచారణ చేయడం లేదని ప్రశ్నించారు. సిట్ నోటీసులివ్వాల్సింది తమకు కాదని.. సీఎం కేసీఆర్, కేటీఆర్ లకు ఇవ్వాలని ధ్వజమెత్తారు.
పేపర్ లీక్ కేసుపై ఎవరు మాట్లాడకుండా నోటీసులిస్తున్నారని మండిపడ్డారాయన. 30 లక్షల నిరుద్యోగుల బతుకులు ఆగం చేయడం సర్వసాధారణమా? అని ప్రశ్నించారు. ఎట్టి పరిస్థితుల్లో కేటీఆర్ రాజీనామా చేసే వరకు పోరాటం ఆపబోమని స్పష్టం చేశారు.