హిండెన్‌బర్గ్ రీసర్చ్ సంస్థ త్వరలో కొత్త రిపోర్ట్‌ను రిలీజ్ చేయనున్నది. ఈ విషయాన్ని ఆ సంస్థ తన ట్విట్టర్లో తెలిపింది. ఇటీవల అదానీ స్టాక్స్ అంశంపై అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్ సంస్థ ఇచ్చిన రిపోర్ట్ వల్లే.. ఆ కంపెనీ షేర్లు పతనమైన విషయం తెలిసిందే.
అయితే ఇప్పుడు హిండెన్‌బర్గ్ ఎవర్ని టార్గెట్ చేసిందన్న కోణంలో పుకార్లు సాగుతున్నాయి. ఓ అతిపెద్ద విషయాన్ని బహిర్గతం చేయనున్నట్లు హిండెన్‌బర్గ్ తన ట్వీట్లో వెల్లడించింది. జనవరి 24వ తేదీన అదానీ గ్రూపుపై హిండెన్‌బర్గ్ సంస్థ 106 పేజీల రిపోర్టును రిలీజ్ చేసింది.
అదానీ సంస్థ ఆర్థిక అక్రమాలకు పాల్పడినట్లు ఆ నివేదికలో ఆరోపించింది. ఆ రిపోర్టు వల్ల అదానీ కంపెనీ ట్రేడింగ్‌లో సుమారు 86 బిలియన్ల డాలర్లు నష్టపోయింది. త్వరలో రిలీజ్ చేయబోయే రిపోర్టులో ఎవరి గురించి ఉంటుందన్న విషయాన్ని ఆ సంస్థ చెప్పలేదు. కానీ ఇటీవల అమెరికాలో జరిగిన బ్యాంకుల మూసివేత గురించి కొత్త రిపోర్టు ఉంటుందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
మరోవంక, దేశంలోని అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకర్లను వారి బాండ్ పోర్ట్‌ఫోలియోల వివరాలను సమర్పించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. శనివారం ప్రభుత్వ బ్యాంకుల అధిపతులతో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సమావేశం జరిగే వీలుండటంతో ఇది అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంటున్నది.
అమెరికాలో సిలికాన్ వ్యాలీ బ్యాంక్ (ఎస్వీబీ), సిగ్నేచర్ బ్యాంక్.. యూరప్‌లో క్రెడిట్ స్విస్ బ్యాంక్‌ల ద్రవ్య సంక్షోభం మధ్య మోదీ సర్కారు నిర్ణయం చర్చనీయాంశమైందిప్పుడు. 25న త్రైమాసిక బ్యాంకింగ్ సమీక్షా సమావేశం జరిగే అవకాశాలుండగా, అంతకంటే ముందే బాండ్ పోర్ట్‌ఫోలియోల డాటాను కేంద్రం కోరినట్టు ఏడు ప్రభుత్వ బ్యాంకుల వర్గాలు చెప్తున్నాయి.
ఎస్వీబీ, సిగ్నేచర్ బ్యాంక్, క్రెడిట్ స్విస్ బ్యాంక్‌ల తరహాలోనే భారతీయ బ్యాంకులు, ముఖ్యంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు ఒత్తిడిని ఏమైనా ఎదుర్కొంటున్నాయా? అన్న అనుమానాలు కేంద్ర ప్రభుత్వానికి ఉన్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.