మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్స్ ఫైనల్లో తెలంగాణ క్రీడాకారిణి నిఖత్ జరీన్ రెండవ టైటిల్‌ను గెలుచుకుంది. 50 కేజీల విభాగంలో వియత్నాంకు చెందిన ఎన్గుయెన్ తై టామ్ పై 5-0తేడాతో గెలిచి బంగారు పతకం కైవసం చేసుకుంది.
ఆదివారం న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జరిగిన 50 కేజీల విభాగం ఫైనల్లో నిఖత్ జరీన్ 5-0తో విజయం సాధించి వరుసగా రెండో టైటిల్‌ను కైవసం చేసుకుంది. వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్స్‌లో గత ఏడాది కూడా గోల్డ్ మెడల్ సాధించిన నిఖత్ జరీన్.. వరుసగా రెండో సారి భారత్‌కి పసిడి అందించింది. ‘
అలానే ఈ టోర్నీలో ఒకటి కంటే ఎక్కువ సార్లు మెడల్ సాధించి, మేరీకోమ్ తర్వాత ఒకటి కంటే ఎక్కువ ప్రపంచ టైటిళ్లను సాధించిన రెండో భారతీయ మహిళా బాక్సర్‌గా నిలిచింది. వాస్తవానికి గత ఏడాది 52 కేజీల విభాగంలో నిఖత్ జరీన్ పోటీపడింది. కానీ.. ఈ ఏడాది 50 కేజీల కేటగిరీలోకి మారిన నిఖత్ జరీన్.. అంచనాలకి మించి ప్రదర్శనని కనబరుస్తూ తుది పోరుకి చేరుకుంది.
ఇప్పటికే ఆసియా క్రీడలకి అర్హత సాధించిన నిఖత్ జరీన్.. 2024 పారిస్ ఒలింపిక్స్‌కి అర్హత సాధించే దిశగా అడుగులు వేస్తోంది. ఆదివారం 75 కేజీల విభాగంలో లవ్లీనా బోర్గోహైన్ కూడా బంగారు పతకాన్ని సాధించింది.
వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్స్ 2023లో నీతు గాంగాస్, స్వీటి బూర శనివారం రెండు గోల్డ్ మెడల్స్‌ని భారత్‌కి అందించారు. 48 కేజీల విభాగంలో పోటీపడిన నీతు.. మంగోలియా బాక్సర్‌పై 5-0 తేడాతో విజయం సాధించింది. అలానే 84 కేజీల విభాగంలో పోటీపడిన స్వీటీ.. చైనా బాక్సర్ వాంగ్ లీనాపై 4-3 తేడాతో గెలుపొందింది.