మైనారిటీ రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తేల్చిచెప్పారు. మత ప్రాతిపదికపై రిజర్వేషన్లు కల్పించాలనే తెలిపే నిబంధన రాజ్యాంగంలో లేదని తెలిపారు. కర్ణాటకలోని బీదర్ జిల్లా బస్వకళ్యాణ్ తాలూకా గోరట గ్రామంలో `గోరోటా షహద్ స్మారక్’ను సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ విగ్రహాన్ని ఆయన ప్రారంభించారు. అదేవిధంగా 103 అడుగుల ఎత్తయిన జాతీయ జెండాను ఆవిష్కరించారు.
కర్ణాటక శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అమిత్ షా స్థానికంగా నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ,.కాంగ్రెస్ ప్రభుత్వం పోలరైజేషన్ పాలిటిక్స్ కోసం మైనారిటీలకు రిజర్వేషన్లు ఇచ్చిందని విమర్శించారు. ఆ రిజర్వేషన్లను బీజేపీ రద్దు చేసిందని, ఆ కోటాను వొక్కళిగలకు, లింగాయత్‌లకు ఇచ్చిందని చెబుతూ ఈ విషయమై కర్ణాటక మంత్రివర్గం తీసుకున్న నిర్ణయానికి మద్దతు ప్రకటించారు.
ఓటు బ్యాంకు కోసం దురాశతో కాంగ్రెస్ ఎన్నడూ స్వాతంత్య్ర సమరయోధులను స్మరించుకునే కార్యక్రమాలను నిర్వహించలేదని అమిత్ షా ధ్వజమెత్తారు. అదే విధంగా హైదరాబాద్ విముక్తి దినోత్సవాలను కూడా నిర్వహించలేదని విమర్శించారు. హైదరాబాద్ విముక్తి, స్వాతంత్య్రం కోసం అనేక మంది ప్రాణత్యాగం చేశారని చెప్పారు.
సర్దార్ పటేల్ లేకపోతే హైదరాబాద్‌కు స్వాతంత్య్రం వచ్చి ఉండేది కాదని స్పష్టం చేశారు. బీదర్‌కు కూడా స్వాతంత్య్రం వచ్చి ఉండేది కాదని పేర్కొన్నారు హైదరాబాద్ విముక్తి పోరాటంలో గరోటా గ్రామస్థుల త్యాగాలు మరువలేనివని కొనియాడారు. 2.5 అడుగుల ఎత్తయిన త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసినందుకు క్రూరుడైన నిజామ్ సైన్యం గరోటా గ్రామస్థులను హత్య చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.
అదే గ్రామంలో ఆ అమర వీరుల స్మారకాన్ని నిర్మించామని తెలిపారు. కేవలం త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసినందుకు వందలాది మందిని హత్య చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అదే గడ్డపైన మనం 103 అడుగుల ఎత్తయిన త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడం గర్వకారణమని చెప్పారు. ఇది ఎవరి దృష్టినీ తప్పించుకోదన్నారు.
హైదరాబాద్ నుంచి నిజాం పాలకుడిని తప్పించడంలో మన దేశ తొలి హోం మంత్రి సర్దార్ పటేల్ పోషించిన పాత్రకు గుర్తుగా ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆయన పోషించిన పాత్ర వల్లే బీదర్ భారత దేశంలో అంతర్భాగం అయిందని పేర్కొన్నారు.