బిఆర్ఎస్ ఎంఎల్సి కవిత పిటిషన్పై సోమవారం సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. కవిత పిటిషన్పై విచారణను మూడు వారాలకు వాయిదా వేస్తున్నట్లు సుప్రీం కోర్టు తెలిపింది. లిఖితపూర్వక వాదనలను సమర్పించాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, కవితలకు సుప్రీంకోర్టు ఆదేశించింది.
కవిత తరుపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ వాదనలను వినిపించారు. నళినీ చిదంబరం, అభిషేక్ బెనర్జీల కేసేులను పరిశీలించాలని కోరారు. మహిళను ఈడీ కార్యాలయానికి ఎలా పిలుస్తారంటూ కపిల్ సిబాల్ వాదించారు. అయితే పీఎంఎల్ఏ యాక్ట్ కింద ఎవరినైనా కార్యాలయానికి విచారణ నిమిత్తం పిలవచ్చని ఈడీ తరుపున న్యాయవాది స్పష్టం చేశారు. ఇరువురి వాదనలు విన్న జస్టిస్ అజయ్ రసోగి, జస్టిస్ ద్వివేదిలతో కూడిన ధర్మాసనం మూడు వారాలకు వాయిదా వేసింది.
దేశవ్యాప్తంగా సంచలన సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇడి అధికారులు ఆమెకు సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇడి సమన్లు రద్దు చేయాలని కోరుతూ సర్వోన్నత న్యాయస్థానంలో పిటీషన్ వేశారు. అదేవిధంగా మద్యం కుంభకోణంలో తన నివాసంలో గాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గాని తనను విచారణ చేయాలని కవిత పిటిషన్ లో పేర్కొన్నారు. తనను ఇడి అధికారులు అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు.
కవిత తన పిటిషన్లో సరికొత్త అభ్యర్థన చేశారు. మద్యం పాలసీ కేసు విచారణ కోసం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) ఏర్పాటు చేయాలని కోరారు. సాక్షిగా పిలిచిన మహిళను తమ ఇంటి వద్ద లేదా.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించాలని పిటిషన్లో కవిత కోరారు. సీఆర్పీసీ సెక్షన్ 160ని ఉల్లఘించి… తనని ఈడీ కార్యాలయానికి పిలిచి విచారిస్తున్నారని కవిత పేర్కొన్నారు. విచారణ సందర్భంగా… ఈడీ అధికారులు మానసిక, శారీరక ఇబ్బందులకు గురి చేస్తున్నారని.. గతంలో పలు ఉదాహరణలు ఉన్నాయని కవిత తెలిపారు.