గోషామహల్ ఎమ్యెల్యే రాజాసింగ్‌పై ఇప్పటికే చాలా కేసులు నమోదై ఉండగా తాజాగా ముంబై పోలీసులు మరో కేసును నమోదు చేశారు. ఈ ఏడాది జనవరి 29న ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యల చేశారంటూ ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు ఆయనపై ముంబై పోలీసులు ఐపీసీ 153 ఏ 1 (ఏ) కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
సకల్ హిందూ సమాజ్ జనవరి 29న ఒక సామాజిక కార్యక్రమాన్ని నిర్వహించడానికి అనుమతిని కోరింది. శివాజీ పార్క్ నుంచి దాదర్‌లోని మహారాష్ట్ర స్టేట్ లేబర్ వెల్ఫేర్ బోర్డు వరకు సకల్ హిందూ సమాజ్ ఆధ్వర్యంలో మార్చ్ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించారు.
మహిళలను దుర్వినియోగం చేయడం, వారి భద్రత, గౌరవానికి ఆటంకం కలిగించడాన్ని నిరసిస్తూ ఈ నిరసన కార్యక్రమం చేపట్టారు. దాదర్ పోలీస్ స్టేషన్లో నమోదైన ఎఫ్ఐఆర్ ప్రకారం.. మార్చ్‌కు పోలీసులు అనుమతించారు, నిర్వహకులు ర్యాలీ కూడా నిర్వహించారని, అందులో ఎంఎల్ఎ రాజాసింగ్ రెచ్చగొట్టే విధంగా ప్రసంగం చేశారని, ఆ తర్వాత వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిందని పేర్కొన్నారు.
రాజాసింగ్ ముంబైలో చేసిన వ్యాఖ్యలపై హైదరాబాద్ పోలీసులు సైతం గతంలో నోటీసులు జారీ చేశారు. బెయిల్ షరతులను ఉల్లంఘించి మతపరమైన వ్యాఖ్యలు చేశారని రాజాసింగ్ ఈ ఏడాది జనవరిలో నోటీసులిచ్చారు. వివాదస్పద వ్యాఖ్యలు చేశారంటూ గతేడాది ఆయనపై హైదరాబాద్ పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు. అనంతరం అరెస్టు చేసి జైలుకు తరలించగ, కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
ర్యాలీలు, బహిరంగ సభల్లో పాల్గొనవద్దని బెయిల్ షరతుల్లో పేర్కొంది. తెలంగాణ హైకోర్టు షరతు విధించిన సంగతిని హైదరాబాద్ పోలీసులు ఇచ్చిన నోటీసుల్లో పేర్కొన్నారు. గతేడాది ఆగస్టులో హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన స్టాండప్ కమెడియన్ మునావర్ ఫారూఖీ షో నిర్వహణపై ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఫారూఖీ షోకు వ్యతిరేకంగా మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ రాజాసింగ్ ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియోపై హైదరాబాద్‌తో పాటు దేశవ్యాప్తంగా ముస్లింలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ పరిధిలోని పలు పోలీసు స్టేషన్లలో ఆయనకు వ్యతిరేకంగా ఫిర్యాదులు అందాయి.
ఈ క్రమంలోనే డబీర్ పురా పోలీసులు రాజాసింగ్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అనంతరం పీడీ యాక్ట్ విధించి ఆయన్ను జైలుకు పంపించారు. ఆ తర్వాత షరతులతో కూడిన బెయిల్‌పై ఆయన విడుదలయ్యారు. ఇక మహ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలపై బీజేపీ అధిష్టానం కూడా సీరియస్ అయి పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. తెలంగాణ శాసనసభపక్షనేతగా తొలగించింది. ప్రస్తుతం ఆయన బీజేపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.